
IND vs SL: ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. భారత యువ బ్యాటర్ సాయి సుదర్శన్ గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. శ్రీలంక పర్యటన కోసం భారత జట్టు ఇప్పటికే అక్కడికి చేరుకున్నప్పటికీ.. సాయి సుదర్శన్ మాత్రం జట్టుతో కలిసి వెళ్లలేకపోయాడు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE)లో రిహ్యాబిలిటేషన్ పూర్తి చేసుకుని ఆగస్టు 8న శ్రీలంకకు వెళ్లాల్సి ఉంది. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతడు సిరీస్ నుంచి వైదొలిగినట్లు సమాచారం.
గాయం కారణంగా సాయి సుదర్శన్‌కు బ్రేక్
సాయి సుదర్శన్ కుడి కాలిలో స్ట్రెస్ సమస్యతో బాధపడుతున్నాడు. గాయం నుంచి కోలుకునేందుకు COEలో వైద్యుల పర్యవేక్షణలో రిహ్యాబ్ తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగా బ్యాటింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. అయితే నొప్పి పూర్తిగా తగ్గకపోవడంతో శ్రీలంకతో తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం సాధ్యం కాలేదు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా సాయి సుదర్శన్‌ను మొత్తం టెస్ట్ సిరీస్ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. అతడి గాయం తీవ్రత, పూర్తిగా కోలుకోవడానికి పట్టే సమయం వంటి అంశాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
సాయి స్థానంలో రుతురాజ్ లేదా సర్ఫరాజ్?
సాయి సుదర్శన్ స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకోవాలనే అంశంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. బీసీసీఐ ఇప్పటివరకు అధికారికంగా రీప్లేస్‌మెంట్‌ను ప్రకటించలేదు. అయితే ఇద్దరు బ్యాటర్లు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ఓపెనర్ రుతురాజ్ గాయక్వాడ్, ముంబై మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఒకరికి సెలెక్టర్లు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అయితే తుది నిర్ణయం బీసీసీఐ, సెలక్షన్ కమిటీ తీసుకోవాల్సి ఉంది.
14 మందితో టీమిండియా స్క్వాడ్
సాయి సుదర్శన్ వైదొలగడంతో ప్రస్తుతం భారత టెస్ట్ స్క్వాడ్‌లో 14 మంది ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నారు.
భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, ఆకిబ్ నబీ డార్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్.
ఆగస్టు 15 నుంచి తొలి టెస్ట్
భారత్, శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆగస్టు 15 నుంచి 19 వరకు గాళ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఆ తర్వాత రెండో టెస్ట్ ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) స్టేడియంలో జరుగుతుంది.
సిరీస్ ప్రారంభానికి ముందే సాయి సుదర్శన్ వంటి యువ బ్యాటర్ దూరం కావడం టీమిండియాకు ఇబ్బందికర పరిణామమే. ఇప్పుడు అతడి స్థానంలో రుతురాజ్ గాయక్వాడ్‌కు ఛాన్స్ వస్తుందా? లేక సర్ఫరాజ్ ఖాన్‌కు మరో అవకాశం దక్కుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..