IND vs SA: టాస్ గెలిచేందుకు సూపర్ స్కెచ్.. ఆయన సెంటిమెంట్‌ను ఫాలో చేస్తానంటోన్న కెప్టెన్ సూర్య

Surya Kumar Yadav on Toss: టీం ఇండియాకు టాస్ ఒక ప్రధాన సమస్యగా మారింది. భారతదేశంలో జరిగే డే-నైట్ మ్యాచ్‌లలో, మంచు కారణంగా టాస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో, టాస్ గెలవడం చాలా కీలకం అవుతుంది. కానీ దానిని సాధించడానికి కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సూపర్ స్కెచ్ తో ముందుకొచ్చాడు.

IND vs SA: టాస్ గెలిచేందుకు సూపర్ స్కెచ్.. ఆయన సెంటిమెంట్‌ను ఫాలో చేస్తానంటోన్న కెప్టెన్ సూర్య
Ind Vs Sa Toss

Updated on: Dec 08, 2025 | 8:11 PM

Surya Kumar Yadav on Toss: భారత్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా, టాస్ విషయం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది. ముఖ్యంగా డే-నైట్ మ్యాచ్‌లలో మంచు ప్రభావం (డ్యూ) ఎక్కువగా ఉండటంతో, టాస్ గెలవడం మ్యాచ్ ఫలితాన్ని శాసించే కీలక అంశంగా మారుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలవడం కోసం ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్‌ను పాటించబోతున్నట్లు వెల్లడించారు.

ఎడమ చేతితో టాస్..

కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా డిసెంబర్ 9న జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో సూర్యకుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా టాస్ గెలవడానికి మీ ప్లాన్ ఏంటని అడగ్గా, తాను కూడా కేఎల్ రాహుల్ ఫార్ములాను ఫాలో అవుతానని సరదాగా సమాధానమిచ్చారు. “నేను కూడా టాస్ వేసేటప్పుడు ఎడమ చేతితో కాయిన్ ఎగరేస్తాను,” అని సూర్య పేర్కొన్నాడు.

కేఎల్ రాహుల్ సెంటిమెంట్ ఏంటి?

ఇటీవల వైజాగ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో కేఎల్ రాహుల్ ఎడమ చేతితో టాస్ వేసి విజయం సాధించాడు. అంతకుముందు టీమిండియా కెప్టెన్లు వరుసగా 20 సార్లు వన్డేల్లో టాస్ ఓడిపోవడం గమనార్హం. రాహుల్ ఎడమ చేతితో కాయిన్ ఎగరేయడంతో ఆ ‘బ్యాడ్ లక్’ స్ట్రీక్‌కు బ్రేక్ పడింది. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా అదే సెంటిమెంట్‌ను ఫాలో అయ్యి కటక్‌లో టాస్ గెలవాలని భావిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మ్యాచ్ ఫలితాలను మలుపు తిప్పే సత్తా ఉన్న టాస్ విషయంలో సూర్య ‘లెఫ్ట్ హ్యాండ్’ మ్యాజిక్ ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి.