
IND vs NZ : ఇండోర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో కివీస్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే శుభారంభం లభించినప్పటికీ, మధ్యలో డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ జోడీ భారత బౌలర్లను ఉతికేసింది. నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు సాధించి, భారత్ ముందు 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
మ్యాచ్ ప్రారంభమైన మొదటి ఓవర్లోనే అర్ష్‌దీప్ సింగ్ తన మ్యాజిక్ చూపించాడు. హెన్రీ నికోల్స్‌ను గోల్డెన్ డకౌట్ చేసి భారత్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ వెంటనే హర్షిత్ రాణా కూడా విజృంభించి డేంజర్ బ్యాటర్ డెవాన్ కాన్వే (5)ను అవుట్ చేయడంతో 5 పరుగులకే కివీస్ 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, ఓపెనర్ విల్ యంగ్ (30)తో కలిసి డారిల్ మిచెల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. యంగ్‌ను కూడా హర్షిత్ రాణా అవుట్ చేయడంతో 58 పరుగుల వద్ద న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది.
మూడు వికెట్లు పడినా డారిల్ మిచెల్ ఏమాత్రం తగ్గలేదు. గ్లెన్ ఫిలిప్స్‌తో కలిసి భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు ఏకంగా 200 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మిచెల్ 131 బంతుల్లో 137 పరుగులు (15 ఫోర్లు, 3 సిక్సర్లు) చేయగా, ఫిలిప్స్ కేవలం 88 బంతుల్లోనే 106 పరుగులు (9 ఫోర్లు, 3 సిక్సర్లు) రాబట్టాడు. ఈ జోడీ ధాటికి భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. చివరికి అర్ష్‌దీప్ ఫిలిప్స్‌ను, సిరాజ్ మిచెల్‌ను అవుట్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది.
విమర్శలు ఎదుర్కొంటున్న హర్షిత్ రాణా మరోసారి తన సత్తా చాటుతూ 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా కాన్వేను అవుట్ చేసి ఈ సిరీస్‌లో అతడిపై తన ఆధిపత్యాన్ని చాటాడు. అర్ష్‌దీప్ సింగ్ కూడా మూడు వికెట్లు తీసి రాణించాడు. మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్‌లకు తలో వికెట్ దక్కింది. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా టాప్ ఆర్డర్ ఎలా రాణిస్తుందో చూడాలి. ఇండోర్‌లో భారత్‌కు ఉన్న అజేయ రికార్డును ఈ మ్యాచ్‌లో నిలబెట్టుకుంటారో చూడాలి.