
India vs New Zealand Head to Head Records: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య గురువారం రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో రెండో వన్డే జరగనుంది. వడోదరలో జరిగిన తొలి మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమ్ ఇండియా, ప్రస్తుతం సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో, రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తుండగా, పర్యాటక జట్టు పుంజుకోవాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల రికార్డులు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం.
హెడ్-టు-హెడ్ రికార్డుల్లో ఎవరు ముందున్నారు? భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే క్రికెట్‌లో సుదీర్ఘ చరిత్ర ఉంది. మైదానంలో ఈ రెండు జట్లు తలపడిన ప్రతిసారీ పోరు హోరాహోరీగా సాగుతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు మొత్తం 120 వన్డేల్లో ముఖాముఖి తలపడ్డాయి.
భారత్ విజయం: 62 మ్యాచ్‌లు
న్యూజిలాండ్ విజయం: 50 మ్యాచ్‌లు
ఫలితం తేలనివి: 7 మ్యాచ్‌లు
డ్రా: 1 మ్యాచ్
గణాంకాల పరంగా భారత జట్టు స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నప్పటికీ, తొలి వన్డేలో న్యూజిలాండ్ గట్టి పోటీని ఇచ్చిందని మర్చిపోకూడదు.
గత ఐదు మ్యాచ్‌ల ఫలితాలు: మొత్తం రికార్డుల్లోనే కాకుండా, ఇటీవలి కాలంలో కూడా టీమ్ ఇండియాదే పైచేయిగా ఉంది. గత ఐదు వన్డేల్లో భారత్ వరుసగా ఐదు విజయాలను నమోదు చేసింది. న్యూజిలాండ్ చివరిసారిగా నవంబర్ 2022లో భారత్‌పై వన్డే విజయాన్ని సాధించింది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు కివీస్ జట్టు భారత్‌ను ఓడించలేకపోయింది. రాజ్‌కోట్ మ్యాచ్‌లో గెలిచి ఈ పరాజయాల పరంపరకు అడ్డుకట్ట వేయాలని న్యూజిలాండ్ పట్టుదలతో ఉంది.
రాజ్‌కోట్‌లో భారత్ ట్రాక్ రికార్డ్: రాజ్‌కోట్‌లోని ఈ మైదానంలో టీమ్ ఇండియా రికార్డు కొంత ఆందోళన కలిగించే విధంగా ఉంది. ఇక్కడ ఇప్పటివరకు భారత్ 4 వన్డేలు ఆడగా, కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది.
అయితే, శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో టీమ్ ఇండియా తొలిసారిగా నిరంజన్ షా స్టేడియంలో అడుగుపెడుతోంది. పాత రికార్డులను చెరిపివేసి కొత్త చరిత్ర సృష్టించాలని భారత్ భావిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, న్యూజిలాండ్ జట్టు ఈ మైదానంలో వన్డే ఆడటం ఇదే తొలిసారి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..