IND vs ENG 1st T20I : సంజూ శాంసన్ వర్సెస్ వైభవ్ సూర్యవంశీ పోరుపై కోచ్ సంచలన వ్యాఖ్యలు

IND vs ENG 1st T20I : ఇంగ్లాండ్‌తో తొలి టీ20కి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఆడించాలని సునీల్ గవాస్కర్ సూచించారు. అయితే సంజూ శాంసన్‌పై పూర్తి నమ్మకం ఉందని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చాట్ స్పష్టం చేయడంతో డెబ్యూపై ఉత్కంఠ నెలకొంది.

IND vs ENG 1st T20I : సంజూ శాంసన్ వర్సెస్ వైభవ్ సూర్యవంశీ పోరుపై కోచ్ సంచలన వ్యాఖ్యలు
Sanju Samson

Updated on: Jun 30, 2026 | 2:33 PM

IND vs ENG 1st T20I : ఐర్లాండ్ పర్యటనలో ఊహించని విధంగా 2-0 తో క్లీన్ స్వీప్ పరాభవాన్ని మూటగట్టుకున్న భారత క్రికెట్ జట్టు.. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరగబోయే 5 మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ టీమిండియా మేనేజ్‌మెంట్‌కు ఒక క్రేజీ సలహా ఇచ్చారు. ఇంగ్లాండ్‌తో బుధవారం జరగబోయే మొదటి టి20 మ్యాచ్‌లోనే 15 ఏళ్ల యువ సంచలనం, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని బరిలోకి దించాలని గవాస్కర్ గట్టిగా మొగ్గు చూపారు. ఐర్లాండ్ చేతిలో ఘోర ఓటమి తర్వాత జట్టు మైండ్‌సెట్‌ను మార్చడానికి, ఇంగ్లాండ్ జట్టును కోలుకోలేని దెబ్బ తీయడానికి ఈ కుర్రాడిని ఆడించడమే కరెక్ట్ ఆప్షన్ అని ఆయన అభిప్రాయపడ్డారు.

వైభవ్ సూర్యవంశీ భయం లేని హిట్టింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌‎లో ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ గెలవడమే కాకుండా.. 237.30 అనే కళ్లు చెదిరే స్ట్రైక్ రేట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఐర్లాండ్ టూర్‌లో ఇతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం దక్కలేదు. సోనీ స్పోర్ట్స్‌తో గవాస్కర్ మాట్లాడుతూ.. “ఇంగ్లాండ్ బౌలర్లకు వైభవ్ బ్యాటింగ్ శైలిపై ఎలాంటి అవగాహన లేదు. వారు ఐర్లాండ్ సిరీస్ చూసి మిగిలిన ఇండియన్ బ్యాటర్లకు ఎలా బౌలింగ్ చేయాలో ప్లాన్ చేసుకుని ఉంటారు. కానీ వైభవ్‌ను ఇప్పటివరకు ఎవరూ అంతర్జాతీయ క్రికెట్లో చూడలేదు. కేవలం ఐపీఎల్ వీడియోలు మాత్రమే చూశారు. కాబట్టి అతను క్రీజులోకి వస్తే ఇంగ్లాండ్ చేతుల్లోంచి మ్యాచ్‌ను లాగేసుకుంటాడు” అని విశ్లేషించారు.

వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకురావడం గవాస్కర్‌కు ఇష్టమే అయినప్పటికీ.. ప్రస్తుతమున్న టాప్ ఆర్డర్ సమీకరణాల వల్ల ఇది చాలా కష్టమైన పని అని ఆయన అంగీకరించారు. ప్రస్తుతం అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లుగా స్థిరపడ్డారు, వన్ డౌన్‌లో ఇషాన్ కిషన్ లాంటి పటిష్టమైన బ్యాటర్ ఉన్నాడు. ఐర్లాండ్ సిరీస్‌లో సంజూ శాంసన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయినప్పటికీ.. మేనేజ్‌మెంట్ అతనిపై నమ్మకం ఉంచింది. టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూకు మరికొన్ని అవకాశాలు ఇవ్వాలని భావిస్తోంది. డగౌట్‌లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఇద్దరూ వైభవ్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తూ చిన్నపిల్లాడిలా చూసుకుంటున్నారని, ఇది టీమిండియాలో ఒక మంచి పరిణామమని గవాస్కర్ కొనియాడారు.

మరోవైపు, భారత్ అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చాట్ మాత్రం గవాస్కర్ వ్యాఖ్యలపై భిన్నంగా స్పందించారు. కేవలం ఒక సిరీస్ ఫెయిల్యూర్ చూసి వరల్డ్ కప్ విన్నర్ అయిన సంజూ శాంసన్‌ను పక్కన పెట్టలేమని స్పష్టం చేశారు. వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి 100 శాతం సిద్ధంగా ఉన్నాడనే విషయంలో ఎలాంటి సందేహం లేదని.. అయితే ప్రతి ఆటగాడిలాగే అతను కూడా తన సమయం వచ్చే వరకు వేచి చూడాల్సిందేనని కోచ్ తేల్చి చెప్పారు. ఐర్లాండ్ టూర్‌లో టీమ్‌కు సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అవసరమున్నా కూడా మేనేజ్‌మెంట్ టాప్ ఆర్డర్‌ను కదపకుండా వాషింగ్టన్ సుందర్‌ను స్పిన్ ఆల్‌రౌండర్‌గా ఆడించింది. దీన్ని బట్టి చూస్తే.. ఇంగ్లాండ్‌తో జరిగే మొదటి టి20 మ్యాచ్‌లో వైభవ్ అరంగేట్రం చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, అతను మరికొన్ని రోజులు బెంచ్ కే పరిమితం కాక తప్పదని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us