ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శుక్రవారం ( అక్టోబర్ 27) పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌తో దక్షిణాఫ్రికా ఆటగాడు కేశవ్ మహరాజ్ ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. స్పిన్ ఆల్ రౌండర్ అయినా మహరాజ్ బౌలింగ్‌లో ఒక్క వికెట్లు తీయలేదు. బ్యాటింగ్ కూడా 21 బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. అయితేనేం.. 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున ఉన్న తన జట్టుకు మహరాజ్ అద్భుతమైన విజయాన్ని అందించాడు. పాకిస్తాన్ భీకర బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ సమయోచిత ఆటతీరును ప్రదర్శించిన కేశవ్ మహరాజ్ తన జట్టుకు హీరోగా మారిపోతే, పాకిస్తాన్ కు మాత్రం విలన్‌గా మారిపోయాడు. ఈ మ్యాచ్‌లో మొదట పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 270 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 47.2 ఓవర్లలో 9 వికెట్ల కోల్పోయి 271 పరుగులు చేసి విజయం సాధించింది. భారత సంతతికి చెందిన కేశవ్ మహారాజ్, పాకిస్తాన్‌పై అద్భుతమైన విజయం తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. ఎందుకంటే ఈ పోస్ట్‌లో మహరాజ్ జై శ్రీ హనుమాన్ అని నినాదం చేశాడు. ‘నాకు దేవునిపై నమ్మకం ఉంది. మా ఆటగాళ్లు షమ్సీ, మార్క్రామ్ ఆట అద్భుతంగా ఉంది. ఇది మాకు ప్రత్యేక విజయం. జై శ్రీ హనుమాన్’ అని ఇన్‌స్టా గ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చాడీ స్టార్ ఆల్‌రౌండర్.
భారత సంతతికి చెందిన కేశవ్ మహారాజ్ ఫిబ్రవరి 7, 1990న డర్బన్‌లో జన్మించారు. హనుమంతుడిని బాగా ఆరాధించే మహరాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో జై శ్రీ రామ్, జై శ్రీ హనుమాన్ అని రాసుకున్నాడు. అతని బ్యాట్‌పై కూడా ఓం అని రాసి ఉండడం విశేషం. ఇక తన భారతీయ మూలాలు మరవని ఈ స్టార్ ఆల్ రౌండర్ తరచూ ఇండియాకు వచ్చి ఇక్కడి హనుమంతుడి దేవాలయాలను సందర్శిస్తుంటాడు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభానికి ముందు కూడా మహరాజ్ తిరువనంతపురం ఆలయాన్ని సందర్శించాడు.
ఇక కేశవ్ మహరాజ్ ఆట విషయానికొస్తే.. 2016లో ఆస్ట్రేలియాతో టెస్టు ఆడటం ద్వారా క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో 4 వికెట్లు తీశాడు. ఆ తర్వాత 2017లో ఇంగ్లండ్ తో మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేశాడు. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించే కేశవ్ మహరాజ్ ఇప్పుడు సౌతాఫ్రికా జట్టులో అత్యంత ముఖ్యమైన ఆటగాడిగా ఎదిగాడు.
మరిన్నిక్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..