ICC Champions Trophy 2025: ఇక సమరమే.. రూ.60 కోట్ల ప్రైజ్‌మనీ.. ఫేవరేట్‌గా బరిలోకి టీమిండియా

మినీ ప్రపంచకప్‌.. ఐసీసీ మెగా చాంపియన్ టోర్నీకి వేళయింది. మరికొన్ని గంటల్లో నువ్వా నేనా అనే రేంజ్‌లో మ్యాచ్ ఆరంభంకాబోతోంది. దుమ్ము దులిపేదెవరు.. దంచికొట్టేదెవరు.. ఫైనల్‌గా టోర్నీలో మీసం మెలేసేదెవరు? చాలా గ్యాప్ తర్వాత జరుగుతున్న ఈ ఎడిషన్‌పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ప్రతిష్టాత్మక టోర్నీ మ్యాచ్‌లు చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ICC Champions Trophy 2025: ఇక సమరమే.. రూ.60 కోట్ల ప్రైజ్‌మనీ.. ఫేవరేట్‌గా బరిలోకి టీమిండియా
Champions Trophy

Updated on: Feb 19, 2025 | 9:52 AM

ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత అభిమానుల ముందుకొస్తోంది ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్ ట్రోఫీ. ఇవాళ్టి నుంచి జరిగే ట్రోఫీలో టీమిండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. 12ఏళ్ల కిందట మెగా టోర్నీలో విజేతగా నిలిచింది భారత్‌. ఇప్పుడు మరోసారి టైటిల్‌ గెలవడమే టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే అరబ్ గడ్డపై టీమిండియా అన్ని విభాగాల్లో సత్తా చాటాల్సిన అవసరం ఉంది. రోహిత్, కోహ్లీ, గిల్, శ్రేయస్‌, పాండ్యా, అక్షర్ పటేల్‌, జడేజాలతో బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తోంది. కుల్దీప్‌, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్‌ల రూపంలో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. దుబాయ్ వికెట్లు స్పిన్‌కి అనుకూలిస్తే వీళ్లకు తిరుగుండదు. బ్యాటింగ్‌, స్పిన్ బాగానే ఉన్నా.. పేస్ బౌలింగ్‌లోనే ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ పేసర్ బుమ్రా లేకపోవడం టీమ్‌కి అతిపెద్ద లోటుగా కనిపిస్తోంది. షమీ, హర్షిత్ ఎలా రాణిస్తారన్నది కీలకంగా మారింది.

భారత జెండా లేకుండానే వేడుకకి సిద్ధమైన పాక్

పాక్ ఆతిధ్యం ఇస్తున్న ఈ టోర్నీలో విజేతగా నిలవాలని అన్ని జట్లు పట్టుదలగా ఉన్నాయి. అయితే కరాచీ స్టేడియంపై భారత జెండా లేకుండానే ప్రారంభ వేడుకలకి సిద్ధమైంది పాక్‌. ట్రోఫీలో ఆడే అన్ని దేశాల జాతీయ పతాకాలు స్టేడియంలో ఎగరవేయడం ఆనవాయితీ. భారత్ మినహా మిగతా దేశాల జెండాలు కనిపించాయి. ఈ పరిణామంపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. మరోవైపు సొంత దేశంలో టోర్నీ జరుగుతుండటంతో కప్పు కొట్టేయాలని పాక్ ఉవ్విళ్లూరుతోంది. ఇందులో తప్పేం లేకపోయినా.. పాక్ ప్రధాని షరీఫ్‌ భారత్‌ను లక్ష్యంగా చేసుకుని కామెంట్లు చేయడం వివాదాస్పదంగా మారింది. చాంపియన్ ట్రోఫిని సొంతం చేసుకుంటే సరిపోదని.. చిరకాల ప్రత్యర్థి టీమిండియాను ఓడించాలన్నారు. ఇంత ఓవరాక్షన్ అవసరమా అంటూ దాయాదికి ఇచ్చిపడేశారు నెటిజన్స్‌. 2021 టీ20 వరల్డ్‌ కప్‌లో ఓటమి మినహా.. ఐసీసీ టోర్నీలో ఆడిన ప్రతీసారి టీమిండియానే గెలిచిందని గుర్తు చేస్తున్నారు. ఇక బంగ్లా కూడా కాస్త ఓవర్‌గానే రియాక్ట్ అయింది. పసి కూనలం అని లైట్ తీసుకోకండి.. ఈసారి కప్పు మాదేనని గొప్పలకు పోయింది. ఈ స్టేట్‌మెంట్‌పైనా సెటైర్ల వర్షం కురిసింది.

అన్ని టీమ్‌లకు కలిపి రూ.60కోట్ల ప్రైజ్‌మనీ

ఇప్పటిదాకా చాంపియన్ ట్రోపి 8సార్లు జరిగింది. ఇది తొమ్మిదో ఎడిషన్‌. భారత్‌, ఆసీస్‌ టీమ్‌లు చెరో రెండుసార్లు టోర్నీ విజేతలుగా నిలిచాయి. ట్రోఫీ ప్రైజ్‌మనీ భారీగా పెంచింది ఐసీసీ. 2017లో చివరిసారిగా టోర్నీ జరిగినప్పటితో పోలిస్తే 53శాతం పెంచింది. దాదాపు 60కోట్ల ప్రైజ్‌మనీ అన్ని టీమ్‌లకు పంచనుంది. విన్నర్‌కి 20.8 కోట్లు.. రన్నరప్‌కి 10.4… సెమీ ఫైనలిస్ట్స్‌కి 5.2కోట్లు అందించనుంది. అలాగే చివరి ప్లేస్‌లో నిలిచిన టీమ్‌కి కూడా 1.22 కోట్లు ఇవ్వనుంది.

ఈనెల 20న బంగ్లా.. 23న పాక్‌తో భారత్ మ్యాచ్‌లు

ట్రోఫీలో పాల్గొంటున్న 8 జట్లను రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు. గ్రూప్‌ ఏలో భారత్‌, పాక్‌, కివీస్, బంగ్లా.. గ్రూప్‌ బీలో ఆసీస్‌, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, ఆఫ్గనిస్తాన్‌ టీమ్స్‌ ఉన్నాయి. ఈనెల 20న బంగ్లాతో సమరానికి సిద్ధమవుతోంది టీమిండియా. ఆ తర్వాత 23న పాక్‌తో మార్చిన 2న కివీస్‌తో ఆడనుంది.

మెగా టోర్నీలో చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే మ్యాచ్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడే ఈ రెండు జట్ల మధ్య పోరు ఎంతో రసవత్తరంగా సాగుతుందనడంలో సందేహం లేదు. చాంపియన్ ట్రోఫీలో ఇరు జట్లు ఇప్పటిదాకా ఐదుసార్లు తలపడ్డాయి. వీటిలో మూడు మ్యాచ్‌లలో పాక్ విజయం సాధిస్తే.. మరో రెండింట్లో భారత్ నెగ్గింది. ఇక దుబాయ్ వేదికగా 23న జరిగే మ్యాచ్‌లో రోహిత్ సేన విక్టరీ కొట్టి లెక్క సరిచేయాలని భావిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..