గతంలో పరుగుల వరద పారించిన విరాట్ కోహ్లీ(Virat Kohli) ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. గతంలో సెంచరీల మీద సెంచరీలు బాదిన ఈ స్టార్ క్రికెటర్ ఇప్పుడు పరుగులు చేయడానికే తంటాలు పడుతున్నాడు. ఈపరిస్థితుల్లో ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీని జట్టులో నుంచి తప్పించాలని పలువురు మాజీలు చెబుతున్నారు. అదే సమయంలో ఫామ్‌లో ఉన్నా లేకున్నా విరాట్ జట్టులో ఉండాల్సిందేనని మరికొందరు అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ మాట్లాడుతూ ‘ కోహ్లీ ఫామ్‌లో లేకపోయినా అతడొక గేమ్ ఛేంజర్ అని.. టీ20 ప్రపంచకప్ జట్టులోకి తీసుకోవాల్సిందే’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఆసీస్ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ (Ricky Ponting) కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. టీమిండియా మేనేజ్‌మెంట్ తప్పకుండా కోహ్లీకి స్థానం కల్పించాలని సూచించాడు. విరాట్ లాంటి స్టార్ ఆటగాడు టీమిండియాలో ఉంటే తనతో పాటు ఏ జట్టైనా భయపడుతుందని పాంటింగ్ పేర్కొన్నాడు.
అప్పటివరకు వేచి ఉంటాను..
‘ప్రత్యర్థి ఆటగాడిగా, సారథిగా నేనైతే కోహ్లీతో కూడిన జట్టుతో ఆడేందుకు కాస్త జంకుతాను. అయితే ఫామ్ కోల్పోవడంతో ప్రస్తుతం అతను గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఎంతటి దిగ్గజ ఆటగాడైనా ఓ దశకు చేరుకున్నాక ఇలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. విరాట్ గాడిలో పడడానికి చాలా కొద్ది సమయం మాత్రమే ఉంది. ఒకవేళ కోహ్లీని కాదని ప్రపంచకప్ టీమ్‌లోకి వేరొకరిని మాత్రం తీసుకుంటే.. మళ్లీ జట్టులోకి రావడం విరాట్‌కు కష్టతరమవుతుంది. నేనేగనుక భారత్‌లో ఉండుంటే నా పూర్తి మద్దతు కోహ్లీకే ఇచ్చేవాడిని. అతడికి చేదోడువాదోడుగా ఉండేవాడిని. టీమిండియా కోచ్‌గా లేకపోతే కెప్టెన్‌గా ఉంటే మాత్రం కోహ్లీ ఫామ్‌లోకి వచ్చేవరకు వేచి ఉంటాను’ అని చెప్పుకొచ్చాడు పాంటింగ్.
మరికొన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..