
Smriti Mandhana: టీమిండియా వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తాజాగా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తన క్రికెట్ ప్రయాణం, ప్రపంచ కప్ విజయం గురించి మాట్లాడుతూ, ఆట పట్ల తనకున్న అంకితభావాన్ని ఆమె మరోసారి చాటుకున్నారు. అమెజాన్ సంభవ్ సమ్మిట్‌లో ఆమె మాట్లాడుతూ ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
క్రికెట్ పట్ల తనకున్న ప్రేమను వివరిస్తూ, “నేను క్రికెట్ కంటే ఎక్కువగా దేనినీ ప్రేమిస్తానని అనిపించడం లేదు. టీమిండియా జెర్సీ ధరించడమే నన్ను ముందుకు నడిపించే ఏకైక ప్రేరణ. ఆ జెర్సీ వేసుకోగానే మన సమస్యలన్నీ పక్కకు వెళ్లిపోతాయి, జీవితం మీద, ఆట మీద మాత్రమే దృష్టి పెడతా,” అని స్మృతి మంధాన అన్నారు. చిన్నప్పటి నుంచే బ్యాటింగ్ అంటే తనకు పిచ్చి అని, ప్రపంచ ఛాంపియన్‌గా పిలిపించుకోవాలనే కోరిక బలంగా ఉండేదని ఆమె గుర్తు చేసుకున్నారు.
2025లో మహిళల ప్రపంచ కప్ గెలిచిన క్షణాలను గుర్తు చేసుకుంటూ, “ఏళ్ల తరబడి మేం చేసిన పోరాటానికి ఈ ప్రపంచ కప్ విజయం ఒక బహుమతి లాంటిది. మేం దీని కోసం ఎంతో కాలంగా ఎదురుచూశాం. నేను 12 ఏళ్లుగా ఆడుతున్నాను, ఎన్నోసార్లు అనుకున్న ఫలితాలు రాలేదు. కానీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు మేం కప్పు గెలుస్తున్నట్లు ఊహించుకున్నాం. చివరికి అది నిజమైనప్పుడు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది,” అని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.
ఫైనల్ మ్యాచ్ సమయంలో మైదానంలో మాజీ కెప్టెన్లు మిథాలీ రాజ్, జులన్ గోస్వామి ఉండటం తమకు మరింత స్ఫూర్తినిచ్చిందని స్మృతి చెప్పారు. “వారి కళ్ళల్లో ఆనందబాష్పాలు చూసినప్పుడు, మహిళా క్రికెట్ మొత్తానికి దక్కిన విజయంగా అనిపించింది. వారి కోసమే ఈ కప్పు గెలవాలని మేం బలంగా కోరుకున్నాం,” అని ఆమె పేర్కొన్నారు.
స్మృతి మంధాన త్వరలో శ్రీలంకతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో బరిలోకి దిగనున్నారు. ఈ సిరీస్ విశాఖపట్నంలో ప్రారంభమై, తిరువనంతపురంలో ముగియనుంది. తన వ్యక్తిగత విషయాలపై వస్తున్న రూమర్లకు పరోక్షంగా చెక్ పెడుతూ, తన ధ్యాస అంతా క్రికెట్ మీదేనని స్మృతి మంధాన స్పష్టం చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..