Rohit Sharma: హిట్‌మ్యాన్ ఇకపై ‘డాక్టర్’ రోహిత్ శర్మ..అరుదైన గౌరవానికి ఎంపికైన భారత మాజీ కెప్టెన్

Rohit Sharma: టీమిండియా సక్సెస్‎ఫుల్ కెప్టెన్, సిక్సర్ల కింగ్ రోహిత్ శర్మ అరుదైన గౌరవానికి సెలక్ట్ అయ్యారు. మైదానంలో బౌలర్లను ఉతికి ఆరేస్తూ హిట్‌మ్యాన్‎గా పేరు తెచ్చుకున్న రోహిత్, ఇప్పుడు తన పేరు ముందు డాక్టర్ అనే బిరుదును తగిలించుకోబోతున్నారు. క్రికెట్ ప్రపంచంలో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించినందుకు గాను ఆయనకు ఈ అత్యున్నత గౌరవం దక్కనుంది.

Rohit Sharma: హిట్‌మ్యాన్ ఇకపై డాక్టర్ రోహిత్ శర్మ..అరుదైన గౌరవానికి ఎంపికైన భారత మాజీ కెప్టెన్
Rohit Sharma

Updated on: Jan 22, 2026 | 5:49 PM

Rohit Sharma: భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కనుంది. ముంబైలోని ప్రముఖ డీవై పాటిల్ యూనివర్సిటీ రోహిత్ శర్మకు గౌరవ డాక్టరేట్ (D.Litt.) ప్రకటించింది. క్రీడారంగంలో ఆయన సాధించిన అసాధారణ విజయాలు, ప్రపంచ వేదికపై భారతదేశ ఖ్యాతిని చాటిచెప్పిన తీరును గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు యూనివర్సిటీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. జనవరి 24, 2026న జరిగే యూనివర్సిటీ 10వ కాన్వొకేషన్ వేడుకలో రోహిత్ శర్మ ఈ పట్టాను అందుకోనున్నారు. ఈ వేడుకలో ఆయనే ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నారు.

రోహిత్ శర్మ భారత క్రికెట్ చరిత్రలో ఒక స్టార్‎గా నిలిచిపోయారు. కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ తర్వాత టీమిండియాకు ప్రపంచకప్‌ను అందించిన మూడవ కెప్టెన్ ఆయనే. రోహిత్ సారథ్యంలో భారత్ 2024 టీ20 ప్రపంచకప్‌ను గెలవడమే కాకుండా, 2025 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ముద్దాడింది. అటు ఆసియా కప్ టైటిళ్లను కూడా తన కెప్టెన్సీలో భారత్ ఖాతాలో వేశారు. జట్టును ముందుండి నడిపించడంలో, యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో రోహిత్ శైలి ప్రత్యేకమైనదని క్రీడా పండితులు ప్రశంసిస్తుంటారు.

రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్‌ను గమనిస్తే.. ఆయన ఒక అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నారు. ఇప్పటివరకు ఆయన 67 టెస్టులు, 282 వన్డేలు, 159 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. టెస్టుల్లో 4301 పరుగులు, వన్డేల్లో ఏకంగా 11,577 పరుగులు, టీ20ల్లో 4231 పరుగులు సాధించారు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్ గా రోహిత్ పేరిట ప్రపంచ రికార్డు ఉంది. ప్రస్తుతం ఆయన కేవలం వన్డే ఫార్మాట్ కు మాత్రమే అందుబాటులో ఉన్నారు. టెస్టులు మరియు టీ20లకు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

సాధారణంగా క్రికెటర్లకు ఇలాంటి గౌరవ డాక్టరేట్లు లభించడం చాలా అరుదు. గతంలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాలకు మాత్రమే ఇలాంటి గౌరవం దక్కింది. ఇప్పుడు ఆ జాబితాలో రోహిత్ శర్మ చేరడం గర్వకారణం. రోహిత్ అభిమానులు ఈ వార్త విన్నప్పటి నుండి సోషల్ మీడియాలో డాక్టర్ రోహిత్ శర్మ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. కేవలం క్రికెట్ మైదానంలోనే కాదు, సామాజికంగా కూడా రోహిత్ అందిస్తున్న స్ఫూర్తిని ఈ డాక్టరేట్ గుర్తిస్తోంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..