Team India : 77ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన టీమిండియా.. భారత్ ఖాతాలో మరో రికార్డు!

భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనను అద్భుతమైన విజయంతో ముగించింది. ఓవల్‌లో జరిగిన ఐదో, చివరి టెస్టులో కేవలం 6 పరుగుల తేడాతో భారత్ థ్రిల్లింగ్ గెలుపు సాధించింది. ఈ విజయంతో 77 ఏళ్లుగా ఉన్న ఒక రికార్డును బద్దలు కొట్టి, విదేశీ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్ గెలిచిన తొలిసారిగా నిలిచింది.

Team India : 77ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన టీమిండియా.. భారత్ ఖాతాలో మరో రికార్డు!
Team India

Updated on: Aug 04, 2025 | 6:39 PM

Team India : భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనను అద్భుతంగా ముగించింది. ఓవల్‌లో జరిగిన ఐదో, చివరి టెస్టులో కేవలం 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విజయం సాధించింది. ఒకానొక సమయంలో ఇంగ్లాండ్ గెలుపు దాదాపు ఖాయమనిపించింది. కానీ భారత బౌలర్లు అద్భుతమైన పోరాట పటిమను చూపి, సిరీస్‌ను 2-2తో సమం చేశారు. ఈ విజయం సిరీస్‌ను గుర్తుండిపోయేలా చేయడమే కాకుండా, 77 ఏళ్లుగా కొనసాగుతున్న ఒక సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది.

77 ఏళ్ల రికార్డు బద్దలు!

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో, చివరి మ్యాచ్‌ను విదేశీ గడ్డపై గెలవడం భారత జట్టు చరిత్రలో ఇదే మొదటిసారి. అంతకుముందు విదేశాల్లో భారత్ 16 సార్లు ఐదు టెస్టుల సిరీస్ ఆడింది. కానీ చివరి టెస్టులో విజయం సాధించలేకపోయింది. ఈసారి భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో చరిత్ర సృష్టించారు. ఓవల్‌లో జరిగిన ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత బౌలర్లు, బ్యాట్స్‌మెన్ల మధ్య అద్భుతమైన సమన్వయం కనిపించింది.

మ్యాచ్ చివరి క్షణాల్లో ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. ఇంగ్లాండ్‌కు గెలవడానికి కేవలం 35 పరుగులు అవసరం కాగా, వారి చేతిలో 4 వికెట్లు ఉన్నాయి. కానీ చివరి రోజు మొదటి సెషన్‌లో భారత బౌలర్లు మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశారు. మహమ్మద్ సిరాజ్ చివరి నాలుగు వికెట్లలో మూడు వికెట్లు తీయగా, ఒక వికెట్ ప్రసిద్ధ్ కృష్ణకు లభించింది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ మొత్తం 9 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ 8 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు.

భారత్ ఖాతాలో మరో రికార్డు!

ఈ మ్యాచ్‌తో భారత జట్టు మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. విదేశాల్లో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-2తో వెనుకబడిన తర్వాత, మళ్లీ పుంజుకుని సిరీస్‌ను 2-2తో సమం చేయడం భారత జట్టు చరిత్రలో ఇదే మొదటిసారి. అంతేకాకుండా, టెస్ట్ క్రికెట్‌లో అత్యంత తక్కువ పరుగుల తేడాతో గెలిచిన మ్యాచ్‌ కూడా ఇదే. ఇది కేవలం ఆటగాళ్ల విజయం మాత్రమే కాదు, భారత క్రికెట్ భవిష్యత్తుకు కూడా ఒక బలమైన పునాది వేసింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..