
Hardik Pandya : కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగిన దక్షిణాఫ్రికాతో మొదటి టీ20 మ్యాచ్‌లో భారత్ 101 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో మెరిసిన హార్దిక్ పాండ్యాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పాండ్యా, తాను ఎల్లప్పుడూ తన కంటే దేశానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని, అవకాశం వచ్చినప్పుడు తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చానని తెలిపారు.
సెప్టెంబర్‌లో శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ 2025 మ్యాచ్‌లో గాయపడిన తర్వాత హార్దిక్ పాండ్యా కొంతకాలం క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఆ గాయం నుంచి కోలుకున్నాక, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. ఆ తర్వాత సౌతాఫ్రికాకు వ్యతిరేకంగా టీ20 సిరీస్‌కు ఎంపికైన పాండ్యా, తన ఫిట్‌నెస్‌ను మైదానంలో నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను 28 బంతులు ఎదుర్కొని, 6 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ తర్వాత బౌలింగ్‌లో రెండు ఓవర్లు వేసి కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ కూడా పడగొట్టాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన తర్వాత హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. “నేను నా షాట్లను నమ్మాలి. ఇక్కడ మీరు కొంచెం ధైర్యం చూపించాలి. ఇది కేవలం బలం ఉపయోగించాల్సిన మ్యాచ్ కాదు, టైమింగ్‌పై దృష్టి పెట్టాల్సిన మ్యాచ్. నేను నా బ్యాటింగ్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను. గత 6-7 నెలలు ఫిట్‌నెస్ పరంగా నాకు చాలా అద్భుతంగా ఉంది. గత 50 రోజుల్లో నాకు ఇష్టమైన వారికి దూరంగా ఉండి, ఎన్సీఏలో సమయం గడిపి, ప్రతి అంశంపై పని చేయడం, ఆ కృషికి మైదానంలో ఫలితం దొరికినప్పుడు చాలా సంతృప్తినిస్తుంది” అని చెప్పాడు.
పాండ్యా తన మాటలను కొనసాగిస్తూ.. “మీకు ఫలితాలు వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. హార్దిక్ పాండ్యా ఏం కోరుకుంటున్నాడు అనే దానితో సంబంధం లేదు, భారత్ ఏం కోరుకుంటుంది అనేదే ముఖ్యం. నాకు అవకాశం వచ్చినప్పుడల్లా, నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కొన్ని రోజులు బాగా ఆడతాను, కొన్ని రోజులు ఆడలేకపోవచ్చు, కానీ నా మైండ్‌సెట్ ఎల్లప్పుడూ నాకు సహాయపడుతుంది. నా మొత్తం కెరీర్‌లో నేను ఆడిన ఏ జట్టుకైనా, దేశానికి మొదటి స్థానం ఇవ్వడానికి ప్రయత్నించాను” అని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా సౌతాఫ్రికా జట్టు 12.3 ఓవర్లలో కేవలం 74 పరుగులకే ఆలౌట్ అయింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.