IPL 2026 : అన్న ఐదోసారి కప్ కొట్టినా ముఖం చాటేసిన హార్దిక్.. ఇద్దరి మధ్య గొడవలు మరింత పెరిగాయా ?

IPL 2026 : ఆర్సీబీ జట్టు ఐపీఎల్ 2026 ట్రోఫి గెలవడంతో కృణాల్ పాండ్యా ఐదోసారి ఛాంపియన్‌గా నిలిచినా, తమ్ముడు హార్దిక్ పాండ్యా అభినందించకపోవడం వల్ల ఇద్దరి మధ్య గొడవల రూమర్స్ ఎక్కువయ్యాయి. కి ఐపీఎల్ 2026 సీజన్ సాగుతున్న సమయంలోనే వీరిద్దరి బంధం దెబ్బతిందనే వార్తలు తెగ హల్‌చల్ చేశాయి.

IPL 2026 : అన్న ఐదోసారి కప్ కొట్టినా ముఖం చాటేసిన హార్దిక్.. ఇద్దరి మధ్య గొడవలు మరింత పెరిగాయా ?
Hardik Pandya

Updated on: Jun 01, 2026 | 5:19 PM

IPL 2026 : క్రికెట్ ప్రపంచంలో పాండ్యా బ్రదర్స్ అంటే తెలియని వారుండరు. మైదానంలో అయినా, బయట అయినా ఎంతో క్లోజ్‌గా ఉండే హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాల మధ్య ఇప్పుడు తీవ్రమైన మనస్పర్థలు వచ్చాయనే వార్త క్రీడా వర్గాల్లో సంచలనం రేపుతోంది. తాజాగా ముగిసిన ఐపీఎల్ 2026 ఫైనల్ తర్వాత ఈ రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. అన్న కృణాల్ పాండ్యా తన కెరీర్‌లో ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి సరికొత్త రికార్డు సృష్టించినప్పటికీ, తమ్ముడు హార్దిక్ పాండ్యా కనీసం సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది.

గత ఆదివారం జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు అద్భుత విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక గెలుపుతో ఆర్‌సీబీ వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న కృనాల్ పాండ్యాకు ఇది కెరీర్‌లో ఐదో ఐపీఎల్ టైటిల్ కావడం విశేషం. ఈ విజయంతో క్రికెట్ ప్రపంచం మొత్తం ఆర్‌సీబీ జట్టుపై, కృణాల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఆర్‌సీబీ గెలిచిన ఆనందంలో అందరూ మునిగిపోతే, నెటిజన్ల కన్ను మాత్రం హార్దిక్ పాండ్యాపై పడింది. తన అన్న అంత పెద్ద విజయం సాధిస్తే హార్దిక్ కనీసం ఒక అభినందన సందేశం కానీ, సోషల్ మీడియా పోస్ట్ కానీ చేయలేదు. పాండ్యా బ్రదర్స్ మధ్య అంతా సవ్యంగా లేదు అంటూ గతంలో వచ్చిన వార్తలకు హార్దిక్ మౌనం మరింత బలాన్ని చేకూర్చింది. అన్నదమ్ముల మధ్య అస్సలు పడటం లేదని, ఇద్దరి రిలేషన్ దెబ్బతిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

నిజానికి ఐపీఎల్ 2026 సీజన్ సాగుతున్న సమయంలోనే వీరిద్దరి బంధం దెబ్బతిందనే వార్తలు తెగ హల్‌చల్ చేశాయి. అయితే అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో దీనిపై కృనాల్ పాండ్యా స్పందించాడు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశాడు. కానీ ఇప్పుడు ఫైనల్ తర్వాత హార్దిక్ ప్రవర్తించిన తీరు చూస్తుంటే ఆ పుకార్లు నిజమేనేమో అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు హార్దిక్ పాండ్యా ప్రస్తుతం తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు కొన్ని నివేదికలు చెప్తున్నాయి. హార్దిక్ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్‌లో చాలా కాలం క్రితమే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఈ ఘోర పరాజయం వల్ల తీవ్ర అప్సెట్ అయిన హార్దిక్, వచ్చే ఐపీఎల్ సీజన్ కంటే ముందే ముంబై ఇండియన్స్ జట్టును వీడాలని నిర్ణయించుకున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

కృనాల్ పాండ్యా ఇప్పటివరకు ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించాడు. గతంలో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఆడుతూ 2017, 2019, 2020 సంవత్సరాల్లో మూడు సార్లు టైటిల్ గెలిచాడు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి వచ్చిన తర్వాత వరుసగా రెండు ట్రోఫీలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో కృనాల్ బ్యాటింగ్‌లో 226 పరుగులు చేయడమే కాకుండా, బౌలింగ్‌లోనూ రాణిస్తూ 14 వికెట్లు పడగొట్టి ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు.

 

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us