”గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయకరంగా ఉంటది’.. ఈ డైలాగ్ టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యాకు సరిగ్గా సరిపోతుంది. గతేడాది ఐపీఎల్‌లో వైఫల్యాల నుంచి ఈ సీజన్‌లో కెప్టెన్‌గా ట్రోఫీని అందుకోవడంలో హార్దిక్ ఎదిగిన తీరు ప్రశంసనీయం. ఎన్నో ఎత్తుపల్లాలు, విమర్శలు ఎదుర్కున్నాడు. ఏమాత్రం అంచనాలు లేని గుజరాత్ టైటాన్స్ సారధిగా బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా.. పెద్ద పెద్ద జట్లకు చుక్కలు చూపించి ఐపీఎల్ ట్రోఫీని చేజిక్కించుకున్నాడు. ‘ఏం జరిగినా ఫర్లేదు.. టీమిండియాకు ప్రపంచకప్ గెలవడమే నా తదుపరి లక్ష్యం. అందుకోసం ఏదైనా చేస్తాను.. జట్టుకు అన్ని విభాగాల్లోనూ సహాయపడితే చాలు’ ఐపీఎల్ 2022 ఫైనల్స్ అనంతరం హార్దిక్ పాండ్యా చెప్పిన మాటలివి. కెప్టెన్సీ తన బాధ్యతను మరింతగా పెంచిందని.. మిగతా వారిలో స్పూర్తినింపేలా మున్ముందు తన ప్రదర్శన ఉండబోతోందని హార్దిక్ పాండ్యా స్పష్టం చేశాడు.
‘కాఫీ విత్ కరణ్’ కాంట్రవర్సీ.. ఆ తర్వాత గాయాల బెడద.. వరుస వైఫల్యాలు.. జాతీయ జట్టులో చోటు దక్కకపోవడం.. ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌కు ముందు ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకోకపోవడం.. ఇలా ప్రతీ చోటా హార్దిక్ పాండ్యాకు చుక్కెదురు అయింది. అయితే ఎక్కడా కూడా హార్దిక్ నిరుత్సాహపడలేదు. అతడి ఆటతీరుపై నమ్మకం ఉంచాడు. అనుకున్నట్లుగానే గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యాను రూ. 15 కోట్లకు దక్కించుకుంది. అనంతరం సారధ్య బాధ్యతలను కూడా అప్పగించింది. తనకు ఇదొక కొత్త చాప్టర్ అనుకున్న హార్దిక్ పాండ్యా.. జట్టును ముందుండి నడిపించడంలో ఎలాంటి పొరపాటు చేయలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. చెన్నై సూపర్ కింగ్స్.. ముంబై ఇండియన్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ లాంటి బలమైన జట్లను ఓడించి.. కెప్టెన్‌గా ఫస్ట్ ఎవర్ ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఒక్క హార్దిక్ పాండ్యాపైనే కాదు.. కృనాల్ పాండ్యాపైనా పలు విమర్శలు వచ్చాయి. అయితే పాండ్యా బ్రదర్స్ ఇద్దరూ వాటిని ధీటుగా ఎదుర్కున్నారు. క్రిటిక్స్‌లో తమ ప్రదర్శనతోనే జవాబిచ్చారు. తాము నిర్దేశించుకున్న గోల్స్‌ను చేరుకున్నారు. గత సీజన్‌తో పోలిస్తే.. ఐపీఎల్ 2022లో హార్దిక్ పాండ్యా.. అటు బౌలర్‌గా ఇటు బ్యాటర్‌గా ఎంతో పరిణితిని చెందాడని చెప్పొచ్చు. కెప్టెన్‌గా వ్యవహరిస్తూ అక్కడక్కడా ఫీల్డ్‌లో ఎమోషన్స్ బయటపెట్టినప్పటికీ.. మొదటి నుంచి చివరి వరకు కూల్ అండ్ కంపోజర్‌తో వ్యవహరిస్తూ.. టీంను ముందుకు తీసుకెళ్లాడు.
ఐపీఎల్ 2022లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై టీమిండియా మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపించారు. టోర్నమెంట్ అంతటా హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా అద్భుతంగా రాణించాడన్నారు. ‘హార్దిక్‌లో అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. అతడు కచ్చితంగా టీమిండియా కెప్టెన్ అవుతాడు’ అని గవాస్కర్ పొగడ్తలతో ముంచెత్తగా.. ‘హార్దిక్ నాయకుడిగా పరిణితి చెందాడు.. కెప్టెన్సీని కూల్‌గా హ్యాండిల్ చేశాడని’ అని గుజరాత్ టైటాన్స్ క్రికెటర్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2021లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన హార్దిక్ పాండ్యా.. ఆ సీజన్ మొత్తాన్ని బౌలింగ్ చేయలేదు. బ్యాటర్‌గానూ పూర్తిగా విఫలమయ్యాడు. 2021 టీ20 ప్రపంచకప్ జాతీయ జట్టులో హార్దిక్ పాండ్యా చోటు సంపాదించుకోలేడని అందరూ ఊహించగా.. సెలెక్టర్లు అతడ్ని పూర్తిస్థాయి బ్యాటర్‌గా ఎన్నుకున్నారు. అయితే వారి నిర్ణయం బెడిసికొట్టింది. టోర్నీలో పాండ్యా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ చేజిక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యాకు వరుసగా గాయాలు వెంటాడాయి. వెరిసి జాతీయ జట్టులో స్థానం కోల్పోయాడు హార్దిక్.
హార్దిక్ పలు సందర్భాల్లో తనపై ధోని ప్రభావం ఎప్పుడూ ఉంటుందని చెప్పకనే చెప్పాడు. ధోని తన బ్రదర్, ఫ్రెండ్, ఫ్యామిలీ అంటూ పలుసార్లు మీడియాతో చెప్పుకొచ్చాడు హార్దిక్ పాండ్యా. ఐపీఎల్ 2022లో కెప్టెన్‌గా హార్దిక్ వ్యవహరించిన స్టైల్ చూస్తుంటే.. ధోని ప్రభావం కచ్చితంగా ఉందని చెప్పొచ్చు. మిస్టర్ కూల్ ధోని నుంచి హార్దిక్ పాండ్యా ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. హార్దిక్ వ్యక్తిత్వంలోని ప్రశాంతత, పరిణితి కనిపించింది. క్రికెటర్‌గా ఎంతో ఎదిగాడు. ప్రతికూల సమయంలో ఒక వ్యక్తి ఆత్మపరిశీలన చేసుకుంటాడు.. అలాగే వైఫల్యాల నుంచి బయటపడేందుకు మార్గాన్ని వెతుకుతాడు. ఈ 28 ఏళ్ల ఆల్‌రౌండర్ కూడా తిరిగి ఫామ్‌లోకి రావాలని శ్రమించాడు.. విజయాన్ని అందుకున్నాడు. హార్దిక్ పాండ్యా స్వయంగా శిక్షణ పొందాడు. గాయాలను అధిగమించాడు.. బౌలింగ్ మళ్లీ తన స్థాయికి తగ్గట్టు వేయగలిగాడు. తనపై వచ్చే నెగటివ్ విమర్శలను పట్టించుకోలేదు.. సాధించగలనన్న తపనతో ముందుకు సాగాడు ఈ స్టైలిష్ ప్లేయర్. ఐపీఎల్ 2022లో హార్దిక్ పాండ్యా..15 మ్యాచ్‌లలో నాలుగు హాఫ్ సెంచరీలతో 487 పరుగులు చేశాడు. అటు బౌలింగ్‌లో 8 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో తనను తాను నాలుగో స్థానానికి ప్రమోట్ చేసుకుని తనపై జట్టు బాధ్యతను వేసుకున్నాడు.. విజయవంతంగా ముందుకు సాగాడు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌కు కెఎల్ రాహుల్ టీమిండియా జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు. అయితే అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ భారత్‌కు నాయకుడిగా వ్యవహరించి.. ఓటమిని చవిచూశాడు. దీనితో అప్పుడే రాహుల్ నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పుడు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి జట్టులో లేకపోవడంతో.. రాహుల్ కీలక సమయాల్లో హార్దిక్ నుంచి సలహాలు తీసుకునే అవకాశం ఉంది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కాబట్టి కచ్చితంగా జట్టును విజయతీరాలకు చేర్చగలరని సెలెక్టర్స్ నమ్మకంతో ఉన్నారు. ఒకవేళ సఫారీలపై భారత్ సిరీస్ ఓడిపోతే.. రాహుల్ కెప్టెన్సీ పోయే అవకాశం ఉంది. సో నెక్స్ట్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాకు పుష్కలంగా ఛాన్స్‌లు ఉన్నాయి. టీమిండియాను హార్దిక్ ముందుండి నడిపించే రోజు దగ్గరలోనే ఉందని చెప్పొచ్చు.