WPL 2026 : ఒకే ఓవర్‌లో 32 పరుగులు..బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆర్సీబీ స్టార్

WPL 2026 : డబ్ల్యూపీఎల్‌లో గ్రేస్ హారిస్ విధ్వంసం సృష్టించింది. కేవలం 22 బంతుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ, 40 బంతుల్లో 85 పరుగులతో యూపీ వారియర్స్‌పై ఆర్సీబీకి ఘన విజయం అందించింది. ఇందులో 5 భారీ సిక్సర్లు, 10 కళ్లు చెదిరే ఫోర్లు ఉన్నాయి. ఆమె బ్యాటింగ్ ధాటికి యూపీ వారియర్స్ నిర్దేశించిన లక్ష్యం కరిగిపోయింది.

WPL 2026 : ఒకే ఓవర్‌లో 32 పరుగులు..బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆర్సీబీ స్టార్
Grace Harris

Updated on: Jan 13, 2026 | 8:21 AM

WPL 2026 : మహిళల క్రికెట్‌లో పవర్ హిట్టింగ్‌కు కొత్త అర్థం చెబుతోంది గ్రేస్ హారిస్. యూపీ వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన పోరులో హారిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. గత సీజన్ వరకు యూపీ వారియర్స్ జట్టులో ఉన్న ఆమె, ఈసారి ఆర్సీబీ జెర్సీ ధరించి తన పాత జట్టుపైనే ప్రతీకారం తీర్చుకుంది. మైదానాన్ని నలుమూలల బాదుతూ సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించడంతో స్టేడియం దద్దరిల్లిపోయింది. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

ఈ మ్యాచ్‌లో హైలైట్ ఏదైనా ఉందంటే అది పవర్‌ప్లే చివరి ఓవర్. విండీస్ దిగ్గజ బౌలర్ డీండ్రా డాటిన్ వేసిన ఈ ఓవర్‌లో హారిస్ విశ్వరూపం చూపించింది. ఆ ఓవర్లో 4, 6, 4, 6, 6, 4 బాదారు. మొదటి బంతి నోబాల్ కావడంతో వచ్చిన ఫోర్, ఆ తర్వాత ఫ్రీ హిట్‌కు సిక్సర్.. ఇలా ప్రతి బంతిని బౌండరీ దాటించింది. నోబాల్స్, వైడ్లతో కలిపి ఆ ఓవర్‌లో మొత్తం 32 పరుగులు వచ్చాయి. ఒకే ఓవర్‌లో 30 పరుగులు కేవలం హారిస్ బ్యాట్ నుంచే రావడం ఆమె బ్యాటింగ్ పవర్‌కు నిదర్శనం. నిన్ననే సోఫీ డివైన్ కూడా 32 పరుగులు రాబట్టిన రికార్డును హారిస్ సమం చేసింది.

హారిస్ విధ్వంసం అక్కడితో ఆగలేదు. కేవలం 40 బంతులు ఆడిన ఆమె 85 పరుగులు పిండుకుంది. ఇందులో 5 భారీ సిక్సర్లు, 10 కళ్లు చెదిరే ఫోర్లు ఉన్నాయి. ఆమె బ్యాటింగ్ ధాటికి యూపీ వారియర్స్ నిర్దేశించిన లక్ష్యం కరిగిపోయింది. 12వ ఓవర్‌లో ఆమె అవుట్ అయ్యే సమయానికే ఆర్సీబీ విజయం ఖాయమైపోయింది. ఆమె వెనుతిరిగిన మూడు బంతులకే బెంగళూరు ఘనవిజయం సాధించింది. ఈ ఇన్నింగ్స్‌తో గ్రేస్ హారిస్ ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకుపోతోంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..