Team India: టీ20 ప్రపంచ కప్ 2026 రేసు నుంచి నలుగురు ఔట్.. లిస్ట్‌లో ఇద్దరు తెలుగోళ్లు..

India's T20 World Cup Squad: ఇటీవలే దక్షిణాఫ్రికా సిరీస్ కోసం ప్రకటించిన జట్టును చూస్తే, ఆసియా కప్ గెలిచిన జట్టులోని చాలా మందిని కొనసాగించినట్లు తెలుస్తోంది. అయితే, రింకూ సింగ్‌ను పక్కన పెట్టడం ద్వారా జట్టులో ఆల్ రౌండర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు అర్థమవుతోంది. ప్రపంచ కప్ సమయానికి జట్టు ఎంపికలో కొందరు కీలక ఆటగాళ్లు రేసు నుంచి తప్పుకునే అవకాశం ఉంది.

Team India: టీ20 ప్రపంచ కప్ 2026 రేసు నుంచి నలుగురు ఔట్.. లిస్ట్‌లో ఇద్దరు తెలుగోళ్లు..
Teamindia

Updated on: Dec 05, 2025 | 9:18 AM

India’s T20 World Cup Squad: 2024లో ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు, డిఫెండింగ్ ఛాంపియన్‌ హోదాలో 2026 టీ20 ప్రపంచ కప్‌లో అడుగుపెట్టనుంది. ఈ టోర్నీకి శ్రీలంకతో కలిసి భారత్ ఆతిథ్యం ఇస్తోంది (ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు). ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. ‘గ్రూప్-ఎ’లో ఉన్న భారత్.. అమెరికా, నమీబియా, పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లతో తలపడనుంది. స్వదేశంలో టైటిల్‌ను కాపాడుకోవాలనే పట్టుదలతో ఉన్న భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు.

17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ 2024లో టి20 ప్రపంచ కప్ సాధించింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి కప్పు గెలిచిన వెంటనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో యువ ఆటగాళ్లతో జట్టును పునర్నిర్మించడంపై బీసీసీఐ దృష్టి సారించింది.

హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి నిలకడైన ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్‌కు అండగా ఉన్నారు. రాబోయే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సిరీస్‌ల కోసం బీసీసీఐ జట్లను సిద్ధం చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇటీవలే దక్షిణాఫ్రికా సిరీస్ కోసం ప్రకటించిన జట్టును చూస్తే, ఆసియా కప్ గెలిచిన జట్టులోని చాలా మందిని కొనసాగించినట్లు తెలుస్తోంది. అయితే, రింకూ సింగ్‌ను పక్కన పెట్టడం ద్వారా జట్టులో ఆల్ రౌండర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు అర్థమవుతోంది. ప్రపంచ కప్ సమయానికి జట్టు ఎంపికలో కొందరు కీలక ఆటగాళ్లు రేసు నుంచి తప్పుకునే అవకాశం ఉంది. టీ20 ప్రపంచ కప్ జట్టు రేసు నుంచి దూరమైనట్లు భావిస్తున్న నలుగురు ఆటగాళ్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి:

1. యశస్వి జైస్వాల్: ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ప్రస్తుతం టెస్ట్ ఫార్మాట్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఇటీవల వన్డేల్లో ఆశించిన స్థాయి ప్రదర్శన చేయలేకపోవడం జైస్వాల్‌కు ఇబ్బందిగా మారింది. మరోవైపు అభిషేక్ శర్మ దూకుడుగా ఆడటం, ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్‌ వైపు మొగ్గు చూపడంతో జైస్వాల్ ప్రాధాన్యత తగ్గింది. దక్షిణాఫ్రికా సిరీస్‌లో అతనికి చోటు దక్కకపోవడం కూడా ఇందుకు నిదర్శనం.

2. నితీష్ కుమార్ రెడ్డి: వైజాగ్‌కు చెందిన నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, టెస్ట్ ఫార్మాట్‌లో బిజీగా ఉండటం వల్ల టీ20 ఎంపిక రాడార్‌లో వెనుకబడ్డాడు. జట్టులో శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా వంటి బలమైన పేస్ ఆల్ రౌండర్లు ఉండటంతో, నితీష్‌కు టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.

3. మహ్మద్ సిరాజ్: 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైనప్పటికీ, గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో సిరాజ్ పొట్టి ఫార్మాట్‌కు దూరమయ్యాడు. హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ వంటి బౌలర్లకు సెలెక్టర్లు ప్రాధాన్యత ఇస్తుండటంతో, సిరాజ్ ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

4. శ్రేయస్ అయ్యర్: అక్టోబర్ 25, 2025న ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు (కడుపు భాగంలో గాయం, అంతర్గత రక్తస్రావం). అసలే టీ20 ఫార్మాట్‌లో రెగ్యులర్ సభ్యుడు కాని అయ్యర్, ఈ గాయం కారణంగా ప్రపంచ కప్ రేసుకు పూర్తిగా దూరమైనట్లే కనిపిస్తోంది. అతను గాయం నుంచి ఎప్పుడు కోలుకుంటాడనే దానిపైనే అతని అంతర్జాతీయ రీఎంట్రీ ఆధారపడి ఉంటుంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..