Year Ender 2024: 2025 సంవత్సరానికి కొన్ని రోజులు మిగిలి ఉన్నాయి. 2024 సంవత్సరం వీడ్కోలు పలకబోతోంది. త్వరలో 2025 సంవత్సరం రాబోతుంది. భారత క్రికెట్ చరిత్రలో 2024 ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఈ ఏడాది భారత పురుషుల క్రికెట్ జట్టు టీ-20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా 17 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అయితే, దీనితో పాటు ఈ ఏడాది కొందరు భారత స్టార్ ఆటగాళ్ల రిటైర్మెంట్ కూడా గుర్తుండిపోతుంది. ఈ ఏడాది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలు టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైరయ్యారు. అతనితో పాటు చాలా మంది భారతీయులు 2024లో రిటైర్మెంట్‌తో క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఈ క్రికెటర్లందరి గురించి తెలుసుకుందాం.
ప్రపంచ క్రికెట్‌లో ‘కింగ్’గా పేరొందిన విరాట్ కోహ్లి టీ-20 ప్రపంచకప్ గెలిచిన వెంటనే రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను టీ-20 ఇంటర్నేషనల్ నుంచి మాత్రమే రిటైరయ్యాడు. అతను ఇప్పటికీ టెస్ట్, వన్డే క్రికెట్ ఆడుతున్నాడు. విరాట్ 125 టీ20 మ్యాచుల్లో 4188 పరుగులు చేశాడు.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా విరాట్‌తో పాటు తన టీ-20 అంతర్జాతీయ క్రికెట్‌కు విరామం ఇచ్చాడు. భారత్‌ను టీ-20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ టెస్టు, వన్డే క్రికెట్‌లో కొనసాగుతున్నాడు. 159 టీ20 మ్యాచ్‌లు ఆడి 4231 పరుగులు చేశాడు.
రోహిత్, విరాట్‌ల జాబితాలో భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా చేరాడు. జడేజా టీ20 ప్రపంచ ఛాంపియన్ అయిన తర్వాత టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి కూడా రిటైర్ అయ్యాడు. అయితే టెస్టు, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించలేదు. జడేజా భారత్ తరపున 74 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
భారత్ తరపున 9 టీ20లు, 73 వన్డేలు ఆడిన కేదార్ జాదవ్ ఈ ఏడాది జూన్‌లో రిటైర్మెంట్ ప్రకటించాడు. సోషల్ మీడియా ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
భారత్ తరపున మూడు వన్డేలు, మూడు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన సిద్ధార్థ్ కౌల్ అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికాడు. నవంబర్ 28న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సిద్ధార్థ్ ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాడు.
2011లో భారత్ తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన వరుణ్ ఆరోన్ ఫిబ్రవరి 2024లో రెడ్ బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను తన సోషల్ మీడియా పోస్ట్‌లో, ‘నేను 2008 నుంచి రెడ్ బాల్ క్రికెట్ ఆడుతున్నాను. నేను వేగంగా బౌలింగ్ చేయడం వల్ల చాలా గాయాలయ్యాయి. ఈ ఫార్మాట్‌లో వేగంగా బౌలింగ్ చేయడానికి నా శరీరం నన్ను అనుమతించదని ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను. అందుకే, నేను క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.
బ్యాటింగ్‌తోనే కాకుండా వికెట్ కీపింగ్‌తోనూ అభిమానుల మనసు గెలుచుకున్న దినేష్ కార్తీక్.. ఈ ఏడాది జూన్ 1న తన 39వ పుట్టినరోజు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. కార్తీక్ కూడా ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. అతను ఇప్పుడు వ్యాఖ్యతగా కనిపిస్తున్నాడు.
భారత్ తరపున టెస్టులు, వన్డేలు ఆడిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా కూడా ఈ ఏడాది క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. నవంబర్ 2024లో తాను క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పాడు. అతను 40 టెస్టులు, 9 వన్డేలు ఆడాడు.
ఐపీఎల్‌లో 93 మ్యాచ్‌లు ఆడిన సౌరభ్ తివారీ.. టీమిండియా తరపున 3 వన్డేలు ఆడాడు. సౌరభ్ ఈ ఏడాది ప్రారంభంలో తన అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి పలికాడు. ప్రస్తుతం లంక టీ10 సూపర్ లీగ్‌లో ‘నువారా ఎలియా కింగ్స్’ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
భారత స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ ఈ ఏడాది ఆగస్టులో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ధావన్ భారత్ తరపున 167 వన్డేలు, 34 టెస్టులు, 18 టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..