Gustav McKeon: రెండు రోజుల క్రితం అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత పిన్న వయస్కులో సెంచరీ సాధించి రికార్డు సృష్టించిన ఫ్రాన్స్ టీనేజ్ క్రికెటర్ గుస్తావ్ మకాన్ (Gustav McKeon) మరోసారి చెలరేగాడు. యూరోపియన్ టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ మరో సెంచరీ సాధించాడు. వాన్టాలో స్విట్జర్లాండ్‌పై సెంచరీ చేసిన ఈ ఆటగాడు బుధవారం నార్వేపై కూడా మూడంకెల స్కోరును అందుకున్నాడు. తద్వారా టీ20 క్రికెట్‌లో వరుసగా రెండు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా గుస్తావ్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా గత మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌పై 109 రన్స్ చేసిన మకాన్ నార్వేపై 101 పరుగులు సాధించాడు. ఈక్రమంలో రెండు మ్యాచ్‌ల్లో కలిసి 210 పరుగులు సాధించాడు. కాగా నార్వేపై 8 సిక్సర్లు, 5 బౌండరీలు బాదిన ఈ టీనేజ్ క్రికెటర్ రెండు మ్యాచ్‌ల్లో కలిపి మొత్తం 17 సిక్సర్లు, 10 ఫోర్లు కొట్టడం విశేషం.
ఈసారి జట్టును గెలిపించి..
కాగా స్విట్జర్లాండ్‌పై మ్యాచ్‌లో గుస్తావ్ సెంచరీ చేసినప్పటికీ ఫ్రాన్స్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్ వేసిన అతను ఏకంగా 16 పరుగులు సమర్పించుకుని ఫ్రాన్స్ పరాజయానికి పరోక్షంగా కారకుడయ్యాడు. అయితే నార్వేపై మాత్రం అలా జరగలేదు. మొదట బ్యాట్‌తో చెలరేగిన ఈ 18 ఏళ్ల క్రికెటర్ బౌలింగ్‌లోనూ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇలా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నందుకే నార్వేపై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అందుకున్నాడు. కాగా మకాన్ ఇప్పటివరకు మూడు అంతర్జాతీతయ T20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఈ 3 మ్యాచ్‌ల్లోనూ 95 కంటే ఎక్కువ సగటుతో 286 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 170కి పైగా ఉంది. మరి 18 ఏళ్లకే రికార్డులు సృష్టిస్తోన్న ఈ గుస్తావ్ రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..