
Team India : మాంచెస్టర్ టెస్ట్‌లో టీమిండియాకు చెందిన ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్లు ఇంతకు ముందు టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ జరగని అద్భుతాన్ని సృష్టించారు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్.. ఈ ఐదుగురు లెఫ్టీ బ్యాట్స్‌మెన్లు ఇంగ్లాండ్‌తో జరిగిన ఒకే టెస్ట్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీలు లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఈ చారిత్రాత్మక టెస్ట్ మొదటి రోజున, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగుల వెనుకంజలో ఉంది. భారత జట్టు కష్టాల్లో పడి, ఓటమి అంచున ఉన్నప్పటికీ, ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌లు ముందుగా ఓర్పుతో, ఆపై దూకుడుగా ఆడి మ్యాచ్‌ను కాపాడటమే కాకుండా ఇంగ్లాండ్‌ను పూర్తిగా వెనక్కి నెట్టారు.
తొలి ఇన్నింగ్స్‌లో ముగ్గురు ‘లెఫ్టీ’ బ్యాటర్ల మెరుపు
యశస్వి జైస్వాల్: 107 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 58 పరుగులు సాధించాడు.
సాయి సుదర్శన్: 151 బంతుల్లో 7 ఫోర్లతో 61 పరుగుల పటిష్టమైన ఇన్నింగ్స్ ఆడాడు.
రిషబ్ పంత్: విరిగిన బొటనవేలితో కూడా 75 బంతుల్లో 54 పరుగుల పోరాట పటిమ గల ఇన్నింగ్స్ ఆడాడు.
రెండో ఇన్నింగ్స్‌లో ఇద్దరు లెఫ్టీ సెంచరీ వీరులు
రవీంద్ర జడేజా: 185 బంతుల్లో నాటౌట్ 107 పరుగులు సాధించాడు.
వాషింగ్టన్ సుందర్: 206 బంతుల్లో నాటౌట్ 101 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ ఇద్దరు ఆటగాళ్లు కలిసి ఐదవ వికెట్‌కు 203 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, మ్యాచ్‌ను డ్రా వరకు తీసుకెళ్లారు. భారత్ నాలుగో, ఐదవ రోజుల్లో నిలకడగా బ్యాటింగ్ చేసి, చివరి రోజు మూడు సెషన్ల పాటు ఆడి మ్యాచ్‌ను కాపాడుకుంది. భారత్ పునరాగమనానికి పునాది కెప్టెన్ శుభ్‌మన్ గిల్(103 పరుగులు, 238 బంతులు), కేఎల్ రాహుల్(90 పరుగులు, 230 బంతులు)ల మూడో వికెట్‌కు 188 పరుగుల పటిష్టమైన భాగస్వామ్యం అందించారు. జడేజా, సుందర్ జోడీ అద్భుతమైన ప్రదర్శనతో మ్యాచ్ ను డ్రా వరకు తీసుకెళ్లారు. వీరిద్దరి సెంచరీలు ఇంగ్లాండ్ విజయంపై చివరి ఆశలను కూడా తుడిచిపెట్టాయి.
భారత టెస్ట్ చరిత్రలో ఒకే టెస్ట్ మ్యాచ్‌లో ఐదుగురు ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌లు హాఫ్ సెంచరీ లేదా అంతకంటే ఎక్కువ స్కోరు చేయడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం భారత్ సిరీస్‌లో 1-2తో వెనుకబడి ఉంది. అయితే, ఐదవ టెస్ట్ జూలై 31న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు సిరీస్‌ను సమం చేసే అవకాశం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..