Faf du Plessis Auction Price: ఐపీఎల్ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాఫ్ డుప్లెసిస్‌ను రూ. 7 కోట్లకు కొనుగోలు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ 2012లో CSKలో చేరినప్పటి నుండి అందులోనే ఉన్నాడు. కానీ అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకోలేదు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో అతన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. ఈ దక్షిణాఫ్రికా బ్యాటర్ ఐపీఎల్‌లో 93 ఇన్నింగ్స్‌లలో 132 స్ట్రైక్ రేట్‌తో 2932 పరుగులు చేశాడు.
ఈ వేలంలో మొదటి ప్లేయర్‌గా శిఖర్ ధావన్ రూ. 8.25 కోట్లకు పంజాబ్ కింగ్స్‌కు అమ్ముడుపోగా.. రెండో ప్లేయర్‌గా అశ్విన్ రూ. 5 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. మూడో ప్లేయర్‌గా ప్యాట్ కమ్మిన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రూ. 7.25 కోట్లకు, నాలుగో ప్లేయర్‌గా కసిగో రబాడ పంజాబ్ కింగ్స్‌కు రూ. 9.25 కోట్లకు అమ్ముడుపోయారు. ఇక ఆ తర్వాత ట్రెంట్ బౌల్ట్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.8 కోట్లకు దక్కించుకుంది. శ్రేయాస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 12.25 కోట్లకు దక్కించుకుంది. రూ. 6.25 కోట్లకు మహమ్మద్ షమీని గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
కాగా, ఐపీఎల్ మెగా వేలం బెంగళూరులో జరుగుతోంది. క్రికెట్ ప్రపంచం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఈ ఆక్షన్‌లో పలు సంచలనాలు నమోదవుతున్నాయి. నాలుగేళ్ల విరామం తరువాత భారీ సంఖ్యలో జరుగుతున్న ఈ మెగా వేలంలో 590 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రెండు రోజులు వేలం జరుగుతుంది.