Fact Check : పెళ్లి కోసమే ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లకు సిరాజ్ దూరం.. అసలు ఎవరీ మాహిరా శర్మ ?

Fact Check : మహ్మద్ సిరాజ్, మాహిరా శర్మ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. బీసీసీఐ ఇచ్చిన విశ్రాంతిని పెళ్లితో ముడిపెడుతూ వచ్చిన రూమర్ల వెనుక అసలు నిజం ఏమిటో తెలుసుకుందాం.

Fact Check  : పెళ్లి కోసమే ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లకు సిరాజ్ దూరం.. అసలు ఎవరీ మాహిరా శర్మ ?
Mohammed Siraj

Updated on: Jun 10, 2026 | 8:05 PM

Fact Check : భారత స్టార్ ఫాస్ట్ బౌలర్, హైదరాబాద్ కుర్రాడు మహ్మద్ సిరాజ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడంటూ గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో ఒక వార్త వేగంగా వ్యాపిస్తోంది. ప్రముఖ మోడల్, నటి మాహిరా శర్మతో సిరాజ్ ప్రేమలో ఉన్నాడని, వీరిద్దరూ జూన్ చివరి వారంలో వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారంటూ ఒక ఎక్స్ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. క్రికెట్ రంగానికి, సినీ రంగానికి లింకులు ఉండటం కొత్తేమీ కాదు. గతంలో విరాట్ కోహ్లీ-అనుష్కా శర్మల జోడీ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. అలాగే ఇటీవల ఐపీఎల్ సమయంలోనూ అర్ష్‌దీప్ సింగ్ పేరు నటి సమ్రీన్ కౌర్‌తో ముడిపడింది. ఈ క్రమంలోనే సిరాజ్ పెళ్లి వార్త కూడా రావడంతో ఫ్యాన్స్ నిజమేనని నమ్ముతున్నారు.

ఈ పెళ్లి రూమర్లకు బీసీసీఐ తీసుకున్న ఒక నిర్ణయం మరింత ఆజ్యం పోసింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు ప్రకటించిన భారత టీ20 స్క్వాడ్‌లో మొదట సిరాజ్ పేరు ఉంది. కానీ, ఆ తర్వాత అతని స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను ఎంపిక చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. సిరాజ్ వరుసగా క్రికెట్ ఆడుతుండటం వల్ల అతని వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని బోర్డు మెడికల్ టీమ్ స్పష్టం చేసింది. అయితే, నెటిజన్లు మాత్రం సిరాజ్ తన పెళ్లి పనుల కోసమే ఈ సిరీస్ నుండి తప్పుకున్నాడంటూ సోషల్ మీడియాలో కథనాలు అల్లేశారు.

“వెడ్డింగ్ బెల్స్ ఫర్ సిరాజ్ & మాహిరా.. జూన్ చివరి వారంలో ఇద్దరూ ఒకటి కాబోతున్నారు” అంటూ ముఫాదల్ వోహ్రా పేరును పోలిన ఒక ఫేక్ అకౌంట్ నుంచి వచ్చిన ట్వీట్ కారణంగానే ఈ గందరగోళం మొదలైంది. అయితే ఈ వైరల్ పోస్ట్‌లో ఎలాంటి నిజం లేదు. సిరాజ్, మాహిరా శర్మల వివాహం జరగబోతోందనే వార్త పూర్తిగా అబద్ధం. వీరిద్దరికీ జూన్ నెలలో ఎలాంటి పెళ్లి ముహూర్తాలు లేవని, ఇదంతా కేవలం లైక్స్ కోసం సృష్టించిన ఫేక్ ట్వీట్ అని తేలిపోయింది.

నిజానికి సిరాజ్, మాహిరా శర్మల మధ్య ఎఫైర్ ఉందంటూ గతంలో కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి. ఆ సమయంలోనే మాహిరా శర్మ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై చాలా స్పష్టంగా మాట్లాడింది. తాను ఎవరితోనూ రిలేషన్‌షిప్‌లో లేనని, తన పేరును అనవసరంగా క్రికెటర్‌తో ముడిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అటు సిరాజ్ కూడా ఇటువంటి రూమర్లను ఎప్పుడూ పట్టించుకోలేదు, వీటిని చాలాసార్లు ఖండించాడు కూడా. కాబట్టి తాజాగా వస్తున్న పెళ్లి వార్తల్లో రవ్వంత కూడా నిజం లేదు.

మహ్మద్ సిరాజ్ గత కొన్ని నెలలుగా తీవ్రమైన క్రికెట్ షెడ్యూల్‌తో బిజీగా ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న సిరాజ్, ఆ తర్వాత ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున అన్ని మ్యాచ్‌లు ఆడాడు. ఆ వెంటనే అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లోనూ శ్రమించాడు. ఈ సుదీర్ఘ సీజన్ కారణంగా అతనికి కాస్త అలసట రాకుండా ముందస్తు జాగ్రత్తగా మాత్రమే బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. ఈ గ్యాప్‌లో హైదరాబాదీ ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నాడే తప్ప పెళ్లి పీటలు ఎక్కడం లేదు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us