
Hookah Controversy : క్రికెట్ ప్రపంచంలో ఎంఎస్ ధోనీ, ఇర్ఫాన్ పఠాన్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ చాలాకాలంగా చర్చ నడుస్తోంది. ఇటీవల ఇర్ఫాన్ పఠాన్ ఐదు సంవత్సరాల క్రితం మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ వీడియోలో ఇర్ఫాన్.. తాను ధోనీ హుక్కా పార్టీలో పాల్గొననందున తనను జట్టులోకి తీసుకోలేదని పరోక్షంగా చెప్పాడు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో ధోనీని చాలామంది విమర్శించారు. అయితే, ఇప్పుడు ధోనీ మాజీ మేనేజర్ ఆ విషయంపై స్పష్టత ఇచ్చారు.
ధోనీ మాజీ మేనేజర్ ఏం చెప్పారు?
ధోనీ మాజీ మేనేజర్ యుద్ధజీత్ దత్తా ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ఒక బ్యాట్ ఫోటోను షేర్ చేశారు. ఆ బ్యాట్‌పై ధోనీ, పఠాన్ ఇద్దరూ సంతకాలు చేసి విత్ లవ్ అని రాశారు. యుద్ధజీత్ దత్తా మాట్లాడుతూ.. “ధోనీ, ఇర్ఫాన్ పఠాన్ మధ్య స్నేహాన్ని నేను ప్రత్యక్షంగా చూసే అదృష్టం నాకు కలిగింది. కొన్ని సంవత్సరాల క్రితం నేను ధోనీతో పాటు మరికొంత మంది క్రికెటర్లకు మేనేజర్‌గా వ్యవహరించాను. పెప్సీ కంపెనీ కోసం ఒక షూటింగ్ జరుగుతున్నప్పుడు, నేను, మహీ, ఇర్ఫాన్ ఒక వ్యాన్‌లో ప్రయాణిస్తున్నాం. ఆ సమయంలో వారు చాలా సరదాగా, స్నేహితులుగా ఉన్నారు” అని చెప్పారు. ఈ పోస్ట్ ద్వారా ధోనీ, పఠాన్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
వివాదానికి కారణమైన పఠాన్ వ్యాఖ్యలు
వైరల్ అయిన వీడియోలో ఇర్ఫాన్ పఠాన్.. “నేను ఎవరి గదిలోకైనా వెళ్లి హుక్కా పెట్టడానికి ఇష్టపడను. అందరికీ ఈ విషయం తెలుసు. దీని గురించి మాట్లాడకపోవడమే మంచిది. ఒక క్రికెటర్ పని మైదానంలో అద్భుతంగా ఆడి చూపించడం. నేను దానిపైనే దృష్టి పెట్టాను” అని అన్నాడు. ఇర్ఫాన్ వ్యాఖ్యలను బట్టి ధోనీకి అతనికి మధ్య విభేదాలు ఉన్నాయని చాలా మంది భావించారు.
అయితే, ఈ విషయంలో ధోనీని చాలా మంది విమర్శించారు. యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ సైతం.. ధోనీ తన సహచర ఆటగాళ్లతో సరిగా ఉండేవారు కాదని ఆరోపించారు. మరోవైపు, క్రికెట్ విశ్లేషకుడు ఆకాష్ చోప్రా మాత్రం ధోనీకి పఠాన్‌కు మధ్య ఎలాంటి ద్వేషం లేదని అన్నారు. మైదానం వెలుపల జరిగే విషయాలను బట్టి ఆటగాళ్ల సెలక్షన్ జరగదని కూడా ఆకాష్ చోప్రా స్పష్టం చేశారు. తాజాగా జరిగిన ఈ సంఘటనలు ధోనీ, పఠాన్‌ల మధ్య ఉన్న స్నేహం లేదా విభేదాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు ముగింపు పలికాయి. మాజీ మేనేజర్ ఇచ్చిన క్లారిటీతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..