Champions Trophy: భారత్‌పై ఘోర పరాజయం.. కట్‌చేస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లండ్ ఔట్?

ICC Champions Trophy 2025: పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో ఉన్న ఇంగ్లండ్ తన తదుపరి మ్యాచ్‌లను ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్థాన్‌లతో ఆడనుంది. ఇంగ్లండ్ ప్రస్తుతం 6 మ్యాచ్‌లు ఆడి 5 ఓటములు, 1 విజయంతో కేవలం 2 పాయింట్లను మాత్రమే కలిగి ఉంది. కాబట్టి ఇంగ్లండ్ టాప్-8లో చేరాలంటే మిగిలిన 3 మ్యాచ్‌ల్లో కనీసం 2 గెలవాల్సి ఉంటుంది.

Champions Trophy: భారత్‌పై ఘోర పరాజయం.. కట్‌చేస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లండ్ ఔట్?
India Vs England

Updated on: Oct 30, 2023 | 2:55 PM

ICC Champions Trophy 2025: ప్రస్తుతం భారతదేశంలో వన్డే ప్రపంచ కప్ (ICC ODI World Cup 2023) జరుగుతోంది. ఇదే సమయంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (ICC Champions Trophy 2025)పై కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఐసీసీ అందించిన సమాచారం ప్రకారం.. వరల్డ్‌కప్‌లో లీగ్ దశ ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో టాప్ 8లో నిలిచిన జట్లు పాకిస్థాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్నాయి. పాకిస్థాన్ ఇప్పటికే ఆతిథ్య జట్టుగా అర్హత సాధించగా, ప్రపంచకప్‌లో టాప్-7లో నిలిచిన జట్లు ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయి. అంటే ప్రస్తుతం ప్రపంచకప్ స్టాండింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న ఇంగ్లండ్ (England) ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే 8 జట్లను ఈ ప్రపంచకప్ నాటికి నిర్ణయిస్తామని ఐసీసీ తెలిపింది. 8 జట్ల టోర్నమెంట్ జూన్ 2025లో పాకిస్థాన్‌లో నిర్వహించనున్నట్లు వార్తా వెబ్‌సైట్ క్రిక్‌ఇన్ఫో నివేదించింది.

ఇంగ్లండ్‌కు తప్పిన అవకాశం?

భారత్, ఇంగ్లండ్‌ల మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత, ప్రస్తుత ప్రపంచకప్ స్టాండింగ్స్‌లో భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్ టాప్-8 స్థానాల్లో ఉన్నాయి. లీగ్ దశ ముగిసే వరకు ఈ జట్లు టాప్-8లో కొనసాగితే.. నెదర్లాండ్స్, ఆఫ్ఘనిస్థాన్ తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయి. అంటే పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో ఉన్న ఇంగ్లిష్ జట్టు ఓటమి పరంపరను కొనసాగిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించినట్లే.

3 మ్యాచ్‌ల్లో 2 తప్పక గెలవాలి..

పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో ఉన్న ఇంగ్లండ్ తన తదుపరి మ్యాచ్‌లను ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్థాన్‌లతో ఆడనుంది. ఇంగ్లండ్ ప్రస్తుతం 6 మ్యాచ్‌లు ఆడి 5 ఓటములు, 1 విజయంతో కేవలం 2 పాయింట్లను మాత్రమే కలిగి ఉంది. కాబట్టి ఇంగ్లండ్ టాప్-8లో చేరాలంటే మిగిలిన 3 మ్యాచ్‌ల్లో కనీసం 2 గెలవాల్సి ఉంటుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ల్లో ఓటమి పాలైనందున, మిగిలిన 3 మ్యాచ్‌లలో 2 గెలవడం ఇంగ్లీష్ జట్టుకు చాలా కష్టం.

బంగ్లాదేశ్-ఇంగ్లండ్‌కు భారీ షాక్..

బంగ్లాదేశ్ జట్టు పట్టికలో 9వ స్థానంలో ఉంది. లీగ్ దశ ముగిసిన తర్వాత కూడా ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లు 9వ, 10వ ర్యాంకుల్లో ఉంటే, రెండు జట్లూ 2025 ఛాంపియన్స్ ట్రోఫీని ఆడలేవు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ ఆరో స్థానంలో ఉంది. పాయింట్ల పట్టికలో ఎక్కడైనా టాప్-8లో నిలిచినట్లయితే, వారితో పాటు మిగిలిన టాప్-7 జట్లు కూడా అర్హత సాధిస్తాయి. ఒకవేళ పాకిస్థాన్ 9 లేదా 10వ స్థానంలో నిలిచినట్లయితే, పాయింట్ల పట్టికలో టాప్-7లో ఉన్న జట్లతో ఛాంపియన్స్ ట్రోఫీని ఆడతాయి.

ఆ అవకాశాన్ని కోల్పోయిన ఇంగ్లండ్..

పట్టికలో పాకిస్థాన్ 10వ స్థానంలో, ఇంగ్లండ్ 8వ స్థానంలో, బంగ్లాదేశ్ 9వ స్థానంలో, నెదర్లాండ్స్ 7వ స్థానంలో నిలిస్తే, ఈ పరిస్థితిలో ఇంగ్లండ్ టాప్ 8లో ఉన్నప్పటికీ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమవుతుంది. కానీ, నెదర్లాండ్స్ అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం నెదర్లాండ్స్ పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్ గెలిస్తే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తుంది.

ఈ మూడు జట్లకు అవకాశం లేనట్లే..

టెస్టు ఆడే దేశాలు వెస్టిండీస్, జింబాబ్వే, ఐర్లాండ్ ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించలేదు. అంటే ఇప్పుడు వెలువడిన ఛాంపియన్స్ ట్రోఫీ క్వాలిఫికేషన్ నిబంధనల ప్రకారం ఈ మూడు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశాన్ని కోల్పోయినట్లే అని చెప్పవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..