3 ఓవర్లలో సెంచరీ.. వామ్మో ఇదెక్కడి ఊర మాస్ బ్యాటింగ్ మావా! క్రికెట్ ప్రపంచాన్ని ఊపేసిన రికార్డ్

క్రికెట్ చరిత్రలో అత్యంత ఆశ్చర్యకరమైన రికార్డుల్లో ఒకటిగా డాన్ బ్రాడ్‌మన్ మూడు ఓవర్లలో సెంచరీ సాధించిన ఘనత నిలిచిపోయింది. 1931లో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో కేవలం 22 బంతుల్లోనే వంద పరుగులు పూర్తి చేసిన బ్రాడ్‌మన్, తన అసాధారణ బ్యాటింగ్ ప్రతిభతో ప్రపంచ క్రికెట్‌ను విస్మయానికి గురి చేశాడు.

3 ఓవర్లలో సెంచరీ.. వామ్మో ఇదెక్కడి ఊర మాస్ బ్యాటింగ్ మావా! క్రికెట్ ప్రపంచాన్ని ఊపేసిన రికార్డ్
Don Bradman

Updated on: Jun 04, 2026 | 5:29 PM

క్రికెట్ చరిత్రలో ఎన్నో అద్భుతమైన రికార్డులు నమోదయ్యాయి. అయితే వాటిలో కొన్ని కాలాతీతంగా నిలిచిపోయాయి. అలాంటి అరుదైన ఘనతల్లో ఒకటి ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ డాన్ బ్రాడ్‌మాన్ సాధించిన మూడు ఓవర్లలోనే సెంచరీ రికార్డు. నేటి టీ20 యుగంలో కూడా ఊహించలేని ఈ ఘనతను బ్రాడ్‌మన్ దాదాపు 95 ఏళ్ల క్రితమే సాధించారు. తాజాగా విడుదలైన రామ్ చరణ్ పెద్ది సినిమాలో హీరో క్యారెక్టర్ క్రికెట్ ఆడుతూ చిత్ర విచిత్రమైన షాట్స్ కొడుతుంటాడు. అలాంటి మాస్ బ్యాటింగ్‌ను అప్పట్లోనే డాన్ ఆడేవారు. 1931 నవంబర్ 2న ఆస్ట్రేలియాలోని బ్లాక్‌హీత్‌, లిత్‌గో జట్ల మధ్య జరిగిన ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో బ్రాడ్‌మన్ ఈ అరుదైన ఫీట్ నమోదు చేశారు. ఆ కాలంలో ఒక ఓవర్‌లో ఆరు కాకుండా ఎనిమిది బంతులు ఉండేవి. అంటే మూడు ఓవర్లలో మొత్తం 24 బంతులు లభించేవి. బ్రాడ్‌మన్ తన సెంచరీని కేవలం 22 బంతుల్లో పూర్తి చేశాడని చారిత్రక రికార్డులు చెబుతున్నాయి.

ఆ మ్యాచ్‌లో మొదటి ఓవర్‌లో 33 పరుగులు, రెండో ఓవర్‌లో 40 పరుగులు, మూడో ఓవర్‌లో 29 పరుగులు నమోదు చేసి మొత్తం 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ సెంచరీని సాధించడానికి ఆయనకు కేవలం 18 నిమిషాల సమయం మాత్రమే పట్టింది. ఈ ఇన్నింగ్స్‌లో బ్రాడ్‌మన్ భారీ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. చివరకు 256 పరుగుల వద్ద రిటైర్డ్ అయ్యారు. అతని ఇన్నింగ్స్‌లో 14 సిక్సర్లు, 29 ఫోర్లు నమోదయ్యాయి. మిగతా బ్యాటర్లందరూ కలిపి చేసిన పరుగుల కంటే బ్రాడ్‌మన్ ఒక్కడే ఎక్కువ పరుగులు చేయడం ఆ మ్యాచ్ ప్రత్యేకతగా నిలిచింది.

అయితే ఈ మ్యాచ్ అధికారిక ఫస్ట్‌క్లాస్ లేదా అంతర్జాతీయ మ్యాచ్ కాకపోవడంతో ఈ రికార్డును అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అధికారిక ప్రపంచ రికార్డుగా గుర్తించలేదు. అయినప్పటికీ క్రికెట్ చరిత్రలో అత్యంత ఆశ్చర్యకరమైన బ్యాటింగ్ ప్రదర్శనల్లో ఒకటిగా ఇది ఇప్పటికీ గుర్తింపు పొందుతోంది. నేటి క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీల గురించి చర్చ వచ్చినప్పుడల్లా, మూడు ఓవర్లలో సెంచరీ బాదిన డాన్ బ్రాడ్‌మన్ పేరు తప్పనిసరిగా వినిపిస్తూనే ఉంటుంది. ఆయన ప్రతిభకు ఈ ఘనత మరో నిదర్శనంగా నిలిచిపోయింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us