IND vs WI : మేం అలాంటి పిచ్ అడగలేదు.. స్పిన్‌కు కష్టపడాల్సిందే.. రవీంద్ర జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌పై కూడా టీమ్ ఇండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి, భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 518 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ సెంచరీలతో చెలరేగారు.

IND vs WI : మేం అలాంటి పిచ్ అడగలేదు.. స్పిన్‌కు కష్టపడాల్సిందే.. రవీంద్ర జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు
Ravindra Jadeja

Updated on: Oct 12, 2025 | 4:22 PM

IND vs WI : వెస్టిండీస్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మొదట బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ 518 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బంతితో మాయ చేసిన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, విండీస్ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. అయితే, రెండో రోజు ఆట ముగిసిన తర్వాత పిచ్ స్వభావంపై జడేజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

రెండో రోజు చివరి సెషన్‌లో రవీంద్ర జడేజా బౌలింగ్‌కు దిగినప్పుడు బంతి బాగా స్పిన్ అవుతూ కనిపించింది. దీంతో ఇది పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలించే పిచ్ అని అందరూ భావించారు. కానీ, ఆట ముగిశాక జడేజా మాట్లాడుతూ.. “పిచ్ ఇలా స్పందిస్తుందని చూసి నేను ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే మేము కేవలం నెమ్మదిగా టర్న్ అయ్యే పిచ్‌లను మాత్రమే అడిగాం. ర్యాంక్ టర్నర్(పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే పిచ్) కావాలని మేము అడగలేదు. ఆట సాగుతున్న కొద్దీ పిచ్ నెమ్మదిగా మారుతుందని, స్పిన్‌కు సహకరిస్తుందని ఊహించాం” అని స్పష్టం చేశాడు.

పిచ్ నెమ్మదిగా ఉండటం, బంతి బౌన్స్ తక్కువగా ఉండటం వల్ల బ్యాటర్లు బ్యాక్‌ఫుట్‌పై ఆడటం ఈజీ అవుతోందని జడేజా అభిప్రాయపడ్డాడు. “ఈ పిచ్‌పై బౌన్స్ తక్కువగా ఉంది, మరీ ఎక్కువగా టర్న్ అవ్వడం లేదు. అందుకే వికెట్లు తీయాలంటే భుజబలాన్ని ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తోంది. ప్రతి బంతీ తిరగదు కాబట్టి, చాలా కష్టపడాలి. మేం ప్రస్తుతం ఉన్న పార్టనర్ షిప్ విడదీయగలిగితే, ఆ తర్వాత పని సులభం అవుతుంది. ఎందుకంటే వారి బ్యాటింగ్‌లో డెప్త్ లేదు” అని జడేజా విశ్లేషించాడు.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ జట్టు 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోరు 518 పరుగులకు ఇంకా 378 పరుగులు వెనుకబడి ఉంది. ఫాలో-ఆన్ గండం నుంచి బయటపడాలంటే కరేబియన్ జట్టు మరో 179 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో బ్యాటర్లు నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అంతకుముందు, రెండో రోజు ఆటను 318/2 స్కోరు వద్ద ప్రారంభించిన భారత్ భారీ స్కోరు సాధించింది. తొలి రోజు 173 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన యశస్వి జైస్వాల్, మరో రెండు పరుగులు జోడించి దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. దీంతో తన టెస్ట్ కెరీర్‌లో మూడో డబుల్ సెంచరీని తృటిలో చేజార్చుకున్నాడు. మరోవైపు, భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (129) అద్భుతమైన సెంచరీతో జట్టు స్కోరును 500 దాటించడంలో కీలక పాత్ర పోషించాడు.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..