BCCI: పేలవ ప్రదర్శనపై బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై మరింత కఠినంగా ఆ టెస్టులు.. విఫలమైతే ఇక నో ఛాన్స్..

గతేడాది భారత క్రికెట్ జట్టు ప్రదర్శన క్షీణించగా.. బీసీసీఐ ప్రస్తుతం మరిన్ని కఠిన చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా యో-యో, డెక్సా టెస్టులను తప్పనిసరి చేసింది.

BCCI: పేలవ ప్రదర్శనపై బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై మరింత కఠినంగా ఆ టెస్టులు.. విఫలమైతే ఇక నో ఛాన్స్..
Team India

Updated on: Jan 01, 2023 | 7:01 PM

భారత క్రికెట్ జట్టు 2022లో ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ చేతిలో 10 వికెట్ల ఓటమి బీసీసీఐతోపాటు అభిమానులను చాలా బాధించింది. టీమ్ ఇండియా నిరాశపరిచిన ప్రదర్శన తర్వాత, ఇప్పుడు బోర్డు పెద్ద మార్పులకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 1న సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త సంవత్సరం ప్రారంభమైన రోజునే, కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, NCA చీఫ్ VVS లక్ష్మణ్‌లతో బోర్డు సమీక్ష సమావేశం జరిగింది. 2022లో టీమిండియా ప్రదర్శన, 2022 టీ20 ప్రపంచకప్‌లో ఓటమిపై సమావేశంలో చర్చించారు. ఆ తర్వాత టీమ్ ఇండియా ఆటగాళ్లపై ప్రభావం చూపే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ భేటీ అనంతరం బయటకు వచ్చిన ప్రధాన విషయాల్లో యో-యో టెస్ట్, డెక్సా టెస్ట్ కూడా చోటు చేసుకుంది. టీమిండియా ఆటగాళ్ల ఎంపికకు డెక్సా టెస్టు, యో-యో టెస్టులను బీసీసీఐ తప్పనిసరి చేసింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్‌ల రోడ్‌మ్యాప్ ఆధారంగా అమలు చేయనున్నారు. యో-యో, డెక్సా పరీక్ష అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

యో-యో టెస్ట్ అంటే ఏమిటి?

యో-యో టెస్ట్‌లో మొత్తం 23 లెవెల్‌లు ఉంటాయి. క్రికెటర్ల కోసం, ఇది 5 వ స్థాయి నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో కోన్‌లను 20 మీటర్ల దూరంలో ఉంచుతారు. ప్రతి క్రీడాకారుడు కోన్‌కు 20 మీటర్లు వెళ్లి 20 మీటర్లు అంటే 40 మీటర్ల దూరం నిర్ణీత సమయంలో తిరిగి రావాలి. స్థాయిల సంఖ్య పెరిగేకొద్దీ, ఈ దూరాన్ని కవర్ చేసే సమయం కూడా తగ్గుతుంది. దీని ఆధారంగా పూర్తిగా సాఫ్ట్‌వేర్‌పై స్కోర్ నిర్ణయిస్తారు. బీసీసీఐ యో-యో టెస్టులో ఉత్తీర్ణత సాధించిన స్కోరును 16.1గా నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి

డెక్సా టెస్ట్ అంటే ఏమిటి?

ఆటగాళ్ల ఫిట్‌నెస్ చెకప్‌ను కొంచెం శాస్త్రీయంగా చేయడానికి ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌లో డెక్సా టెస్ట్ చేర్చారు. ఎముకల సాంద్రత పరీక్షను డెక్సా స్కాన్ అని కూడా అంటారు. ఇది ఎముకల సాంద్రతను కొలిచే ప్రత్యేక రకం ఎక్స్-రే పరీక్ష. ఇది పగుళ్ల గురించి కూడా ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. అలాగే ఈ పరీక్షతో శరీరంలోని కొవ్వు శాతం, ద్రవ్యరాశి, కణజాలం గురించి అన్నీ తెలుసుకోవచ్చు. ఈ 10 నిమిషాల పరీక్ష నుంచి, ఆటగాడు ఎంత ఫిట్‌గా ఉన్నాడో అంచనా వేయనున్నారు. ఈ పరీక్ష X- రే సహాయంతో చేస్తారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..