Quinton de Kock : 10 సిక్సులు, 20 ఫోర్లు రిటైర్మెంట్ తర్వాత కూడా తగ్గని జోరు.. ధోనీ రికార్డు బ్రేక్ చేసిన సౌతాఫ్రికా ప్లేయర్

ఆటగాడు ఆటను వదిలేస్తాడు కానీ ఆడటం మర్చిపోడు అనే నానుడికి సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డికాక్ నిలువెత్తు నిదర్శనం. రెండేళ్ల క్రితం అంతర్జాతీయ వన్డే క్రికెట్‎కు రిటైర్మెంట్ ప్రకటించిన డికాక్, పాకిస్తాన్‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌తో మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చాడు. రిటైర్మెంట్ తర్వాత కూడా అతను తన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు.

Quinton de Kock : 10 సిక్సులు, 20 ఫోర్లు రిటైర్మెంట్ తర్వాత కూడా తగ్గని జోరు.. ధోనీ రికార్డు బ్రేక్ చేసిన సౌతాఫ్రికా ప్లేయర్
Quinton De Kock

Updated on: Nov 09, 2025 | 9:05 AM

Quinton de Kock : ఆటగాడు ఆటను వదిలేస్తాడు కానీ ఆడటం మర్చిపోడు అనే నానుడికి సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డికాక్ నిలువెత్తు నిదర్శనం. రెండేళ్ల క్రితం అంతర్జాతీయ వన్డే క్రికెట్‎కు రిటైర్మెంట్ ప్రకటించిన డికాక్, పాకిస్తాన్‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌తో మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చాడు. రిటైర్మెంట్ తర్వాత కూడా అతను తన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. తాను ఎప్పుడూ క్రికెట్‌కు దూరం కాలేదన్నట్లుగా ఆడాడు. ఈ సిరీస్‌లో డికాక్ ఏకంగా 239 పరుగులు చేశాడు. అంతేకాదు ఈ ప్రదర్శనతో ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న ఒక ప్రపంచ రికార్డును కూడా సమం చేశాడు.

పాకిస్తాన్‌తో జరిగిన 3 వన్డేల సిరీస్‌ను సౌతాఫ్రికా 1-2 తేడాతో కోల్పోయింది. జట్టుకు ఫలితం అనుకూలంగా రాకపోయినా, క్వింటన్ డికాక్ ఈ సిరీస్‌కు హీరోగా నిలిచాడు. సిరీస్‌లోని 3 వన్డేలలో అతను 239 పరుగులు చేశాడు. 119.50 సగటుతో 2 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీతో ఈ పరుగులను సాధించాడు. పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో డికాక్ మొత్తం 30 ఫోర్లు, సిక్సులు బాదాడు. ఇందులో 20 ఫోర్లు, 10 సిక్సులు ఉన్నాయి.

రిటైర్మెంట్ తర్వాత ఆడిన మొదటి వన్డే సిరీస్‌లోనే వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఇంత అద్భుతమైన ప్రదర్శన చేసిన డికాక్‌ను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపిక చేశారు. దీనితో అతను ధోనీ పేరిట ఉన్న ఒక ప్రపంచ రికార్డును సమం చేశాడు. వన్డే క్రికెట్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలిచిన రికార్డు ఇది.

వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా అత్యధికంగా 7 సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు ఎంఎస్ ధోనీ గెలుచుకున్నాడు. అతను తన కెరీర్‌లో ఆడిన 350 మ్యాచ్‌లలో ఈ ఘనతను సాధించాడు. ఇప్పుడు క్వింటన్ డికాక్ ధోనీని సమం చేశాడు. పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్‌తో అతను తన వన్డే కెరీర్‌లో 7వ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. అయితే, డికాక్ ఈ 7 అవార్డులను కేవలం 159 మ్యాచ్‌లలోనే సాధించడం విశేషం.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..