Dhoni: దంచికొట్టిన ధోని శిష్యులు.. అటు సెంచరీల మోత, ఇటు వికెట్ల ఊచకోత.. దెబ్బకు ప్రత్యర్ధులు హడల్

|

Nov 30, 2022 | 8:38 PM

టీమిండియా తలుపులు మూసుకుపోయినా.. కొంతమంది యువ ప్లేయర్స్ డొమెస్టిక్ క్రికెట్‌లో దంచికొడుతున్నారు. వారిలో ఒకరు రుతురాజ్ గైక్వాడ్..

Dhoni: దంచికొట్టిన ధోని శిష్యులు.. అటు సెంచరీల మోత, ఇటు వికెట్ల ఊచకోత.. దెబ్బకు ప్రత్యర్ధులు హడల్
Ruturaj Gaikwad
Follow us on

టీమిండియా తలుపులు మూసుకుపోయినా.. కొంతమంది యువ ప్లేయర్స్ డొమెస్టిక్ క్రికెట్‌లో దంచికొడుతున్నారు. వారిలో ఒకరు రుతురాజ్ గైక్వాడ్. వరుసగా సెంచరీల మోత మోగిస్తూ తన జట్టు మహారాష్ట్రను విజయపథంలోకి దూసుకెళ్లేలా చేస్తున్నాడు ఈ ఆటగాడు. విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్రకు సారధిగా వ్యవహరిస్తున్న గైక్వాడ్ రికార్డు బ్రేకింగ్ డబుల్ సెంచరీ చేయడమే కాకుండా, ఇటీవల జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారీ సెంచరీతో తన జట్టుకు ఫైనల్‌ను చేర్చాడు. కెప్టెన్ గైక్వాడ్‌తో పాటు, అండర్-19 భారత ఫాస్ట్ బౌలర్ రాజ్‌వర్ధన్ హంగర్‌గేకర్ కూడా డెత్ బౌలింగ్‌లో మెరుపులు మెరిపించి.. మహారాష్ట్రకు రెండో సెమీఫైనల్‌లో అస్సాంపై 12 పరుగుల తేడాతో విజయాన్ని అందించారు. దీనితో ఫైనల్‌లో మహారాష్ట్ర, సౌరాష్ట్ర జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

విజయ్ హజారే ట్రోఫీలో నవంబర్ 30వ తేదీన రెండు సెమీఫైనల్‌ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లో జరిగాయి. తొలి సెమీఫైనల్‌లో కర్ణాటకపై ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర అద్భుత విజయాన్ని అందుకుంది. అటు రెండో మ్యాచ్‌లో మహారాష్ట్ర, అస్సాం మధ్య ఉత్కంఠభరిత, హోరాహోరీ పోరు సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర 350 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఇక లక్ష్యచేధనలో భాగంగా అస్సాం 338 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌ ప్రారంభంలోనే మహారాష్ట్ర జట్టు.. ఓపెనర్ రాహుల్ త్రిపాఠి వికెట్‌ను త్వరగా కోల్పోయినప్పటికీ.. కెప్టెన్ గైక్వాడ్ మెరుపులు మెరిపించాడు. కేవలం 126 బంతుల్లో (18 ఫోర్లు, 6 సిక్సర్లు) 168 పరుగులు చేశాడు. అలాగే అంకిత్ బావ్నే(89 బంతుల్లో 110 పరుగులు)తో కలిసి 207 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎంఎస్ ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన గైక్వాడ్‌తో కలిసి అదే జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యువ సహచర ఫాస్ట్ బౌలర్ రాజవర్ధన్ కూడా విధ్వంసం సృష్టించాడు. ఈ ఏడాది అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో భారత్‌ను చాంపియన్‌గా నిలబెట్టిన ఈ బౌలర్.. 10 ఓవర్లలో 65 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. కాగా, అస్సాం తరపున స్వరూపన్ పుర్కాయస్థ(95), సిబ్శంకర్ రాయ్(78), రిషవ్ దాస్(53) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అయినా చివరికి జట్టును విజయపధంలో నడిపించలేకపోయారు. దీంతో మహారాష్ట్ర 12 పరుగుల తేడాతో అస్సాంపై విజయం సాధించింది. మరోవైపు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ డబుల్ సెంచరీ చేయగా.. రాజ్‌వర్ధన్ హంగర్‌గేకర్ 5 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం..