టీమిండియా వెటరన్ ఆటగాడు చతేశ్వర్ పుజారా ఇంగ్లాండ్‌లో జరుగుతోన్న రాయల్ లండన్ కప్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. వరుసగా సెంచరీల మోత మోగించడమే కాకుండా.. విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్ రికార్డులను బ్రేక్ చేశాడు. ఈ టోర్నమెంట్‌లో ససెక్స్ క్రికెట్ క్లబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న పుజారా.. ప్రతీ మ్యాచ్‌లోనూ పరుగులు రాబట్టాడు. మొదటి మ్యాచ్ తడబడినప్పటికీ.. టోర్నీలో ఇప్పటివరకు జరిగిన మిగిలిన మ్యాచ్‌లలో బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లు ఆడటమే కాకుండా.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
టెస్ట్ స్పెషలిస్ట్‌గా పేరొందిన పుజారా ఈ టోర్నీలో ఓవరాల్‌గా 3 బిగ్ సేచరీలు, 2 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. సర్రేతో జరిగిన మ్యాచ్‌లో పుజారా 131 బంతులు ఎదుర్కుని 20 ఫోర్లు, 5 సిక్సర్లతో 174 పరుగులు చేయగా.. మొన్న మిడిల్‌సెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 90 బంతుల్లో 132 పరుగులు చేశాడు. అటు వార్‌విక్‌షైర్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 73 బంతుల్లోనే మెరుపు శతకంతో చెలరేగాడు. ఇక రాయల్ లండన్ కప్‌లో 500 పరుగుల మార్క్ దాటిన రెండో బ్యాటర్ పుజారా కాగా.. అతడు ఇప్పటివరకు టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడి 614 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం.
అదిరిపోయే సెంచరీలతో చతేశ్వర్ పుజారా.. విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్ లిస్టు-ఏ క్రికెట్‌లో నెలకొల్పిన రికార్డులను బద్దలు కొట్టాడు. పుజారా ఇప్పటిదాకా తన లిస్టు-ఏ కెరీర్‌లో 109 ఇన్నింగ్స్‌లు ఆడి.. 57.48 బ్యాటింగ్ యావరేజ్‌తో ఉండగా.. బాబర్ అజామ్ 153 ఇన్నింగ్స్‌లతో 56.56తో.. కోహ్లీ 286 ఇన్నింగ్స్‌లలో 56.60తో మూడో స్థానంలో ఉన్నారు.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..