Sanju Samson Century: సెంచరీతో చెలరేగిన శాంసన్.. ఆ విమర్శలకు గట్టిగానే ఇచ్చిపడేశాడుగా..

Sanju Samson Century: ఐపీఎల్ 2026 సీజన్‌లో పసుపు జెర్సీ ధరించిన సంజు సామ్సన్ ఎట్టకేలకు తన అసలైన ప్రతాపాన్ని చూపించాడు. గత మూడు మ్యాచ్‌ల్లో వరుసగా విఫలమై విమర్శలు ఎదుర్కొన్న ఈ కేరళ స్టార్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. కేవలం 52 బంతుల్లోనే అద్భుత శతకాన్ని బాది, ఈ సీజన్‌లో సెంచరీ నమోదు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

Sanju Samson Century: సెంచరీతో చెలరేగిన శాంసన్.. ఆ విమర్శలకు గట్టిగానే ఇచ్చిపడేశాడుగా..
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 185 మ్యాచ్‌లలో 180 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన సంజు, 31.69 సగటుతో 5000 పరుగుల మార్కును దాటాడు. ఈ మైలురాయిని పూర్తి చేయడానికి సంజు కేవలం 3,555 బంతులు మాత్రమే తీసుకోవడం అతడిని 5000 పరుగులు సాధించిన అత్యంత వేగవంతమైన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిపింది.

Updated on: Apr 11, 2026 | 9:05 PM

Sanju Samson Century: ఈ మ్యాచ్‌కు ముందు సంజు సామ్సన్ ఫామ్‌పై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. మూడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 22 పరుగులు మాత్రమే చేయడంతో అతనిపై ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా స్వింగ్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో సామ్సన్ తడబడుతున్నాడనే విమర్శలు వచ్చాయి. అయితే, వాటన్నింటినీ తుడిచిపెడుతూ ఢిల్లీ బౌలర్లపై సంజు విరుచుకుపడ్డాడు. కేవలం 26 బంతుల్లోనే అర్ధశతకాన్ని అందుకున్న అతను, ఆ తర్వాత మరో 26 బంతుల్లోనే శతక మైలురాయిని చేరుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉండటం విశేషం.

అరుదైన రికార్డుల జాబితాలో సంజు..

ఐపీఎల్ చరిత్రలో సంజు సామ్సన్‌కు ఇది నాలుగో శతకం. ఈ ఘనతతో అతను శుభ్‌మన్ గిల్ సరసన చేరాడు. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ (8), జోస్ బట్లర్ (7), క్రిస్ గేల్ (6), కేఎల్ రాహుల్ (5) తర్వాత స్థానాల్లో సామ్సన్ నిలిచాడు. ఇది మాత్రమే కాకుండా, ఈ ఇన్నింగ్స్ ద్వారా టీ20 క్రికెట్‌లో 400 సిక్సర్ల మైలురాయిని కూడా అతను అధిగమించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో భారతీయుడిగా సంజు రికార్డు సృష్టించాడు.

గాయాన్ని అధిగమించి పోరాటం..

ఈ ఇన్నింగ్స్ సామ్సన్‌కు అంత సులభంగా ఏమీ సాగలేదు. ఒకవైపు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (15) త్వరగానే వెనుదిరిగినా, సంజు పట్టుదలగా నిలబడ్డాడు. అయితే, అర్ధశతకానికి చేరువలో ఉన్న సమయంలో అతనికి వీపు నొప్పి రావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యాడు. గత ఏడాది ఇదే ఢిల్లీ జట్టుపై ఆడుతూ గాయపడి టోర్నీకి దూరమైన చేదు జ్ఞాపకాలు అందరికీ గుర్తొచ్చాయి. ఫిజియోలు వచ్చి చికిత్స చేసిన తర్వాత, నొప్పిని భరిస్తూనే అతను బ్యాటింగ్ కొనసాగించి అపురూప శతకాన్ని పూర్తి చేశాడు.

సొంత మైదానం చెపాక్‌లో సంజు సామ్సన్ ఆడిన ఈ ఇన్నింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు కంటి నిండా నిద్రను ఇచ్చింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఆడుతూనే, భారీ స్కోరు సాధించడంలో సంజు కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో సామ్సన్ తనలోని అసలైన పోరాట యోధుడిని ప్రపంచానికి మరోసారి పరిచయం చేశాడు. తన బ్యాటింగ్ శైలిపై వచ్చిన విమర్శలన్నింటికీ ఈ శతకంతోనే సరైన సమాధానం చెప్పాడు.

Follow Us