
Multibagger Stock: పెట్టుబడి పెట్టాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ, ‘ఎక్కడ ప్రారంభించాలి? ఏ స్టాక్ ఎంచుకోవాలి? నష్టభయం ఎంత ఉంటుంది?’ అనే సందేహాలతో చాలా మంది అడుగు ముందుకు వేయలేరు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ విషయంలో అవగాహన లేకపోవడం వల్ల మంచి అవకాశాలను కోల్పోతుంటారు. స్టాక్ మార్కెట్లో స్వల్పకాలిక హెచ్చుతగ్గులు సహజం. అయితే, దీర్ఘకాలిక పెట్టుబడి (Long-term Investment) ద్వారా అద్భుతమైన సంపదను సృష్టించవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉండి, ఓపికగా వేచి చూడగలిగితే.. మార్కెట్ అందించే రిటర్న్స్ మరే ఇతర పొదుపు పథకాల్లోనూ సాధ్యం కావు.
అయితే, స్టాక్ ఎంపికలో అజాగ్రత్త పనికిరాదు. ఏ స్టాక్ పడితే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం కంటే, కంపెనీ పనితీరును, భవిష్యత్తు ప్రణాళికలను నిశితంగా గమనించాలి. సరైన సమయంలో, సరైన స్టాక్‌ను గుర్తించి, నిపుణుల సలహాతో పెట్టుబడి పెడితేనే మల్టీబ్యాగర్ లాభాలు అందుకోవడం సాధ్యమవుతుంది. కొన్ని స్టాక్స్ దీర్ఘకాలంలో కళ్లు చెదిరే రీతిలో పెరుగుతూ.. ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందిస్తుంటాయి. ఈ క్రమంలో కాసుల వర్షం కురిపించిన ఒక మల్టీబ్యాగర్ స్టాక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదే గోదావరి పవర్ అండ్ ఇస్ఫాత్ (Godawari Power and Ispat).
గోదావరి పవర్ అండ్ ఇస్పాత్ (Godawari Power and Ispat): భారతీయ స్టాక్ మార్కెట్లో మిశ్రమ ట్రెండ్స్ ఉన్నప్పటికీ, మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ధర 7% కంటే ఎక్కువ పెరిగింది. ఒకానొక దశలో ఈ షేరు రూ. 260.10 వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఓసారి చూద్దాం.. డిసెంబర్ 23, 2025న భారత స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, గోదావరి పవర్ అండ్ ఇస్పాత్ షేర్లు దూసుకుపోయాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రభావం, ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపడంతో బెంచ్‌మార్క్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. నిఫ్టీ 50 (Nifty 50) 0.02% పెరిగి 26,177.15 పాయింట్ల వద్ద ముగియగా, సెన్సెక్స్ (BSE Sensex) 0.05% స్వల్ప నష్టంతో 85,524.84 వద్ద ముగిసింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా గోదావరి పవర్ షేరు మునుపటి ముగింపు ధరతో పోలిస్తే 7.7% వృద్ధిని నమోదు చేసింది.
సరిగ్గా ఐదేళ్ల కిందట అంటే 2020 డిసెంబర్ 28న ఈ స్టాక్ ధర రూ. 24.91గా ఉంది. ఇప్పుడు రూ. 252లకు చేరింది. అంటే ఈ ఐదేళ్ల వ్యవధిలో స్టాక్ ధర రికార్డు స్థాయిలో 1027 శాతం పెరిగింది. అంటే ఐదేళ్ల కిందట ఇందులో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి అలానే కొనసాగించి ఉంటే వారి సంపద ఇప్పుడు సుమారుగా రూ. 10.27 లక్షలకు చేరేది.
పెట్టుబడి ప్రణాళికలు (Investment Plan): గోదావరి పవర్ తన పూర్తి అనుబంధ సంస్థ అయిన గోదావరి న్యూ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ (GNEPL) లో రూ. 73.95 కోట్ల పెట్టుబడిని రైట్స్ ఇష్యూ ద్వారా చేపట్టింది. ఈ నిధులను సబ్సిడీ కంపెనీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ (capex), వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం, ముఖ్యంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) ప్లాంట్ ఏర్పాటు కోసం వినియోగించనుంది.
ముగింపు ధర: మంగళవారం ఈ షేరు రూ. 258.90 వద్ద ముగిసింది.
ఐదేళ్ల రిటర్న్స్: గత ఐదేళ్లలో ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు 1027% కంటే ఎక్కువ లాభాలను పంచింది.
వార్షిక వృద్ధి: గత ఏడాది కాలంలో 20% పైగా, అలాగే 2025 సంవత్సరంలో ఇప్పటివరకు (YTD) 21.08% మేర పెరిగింది.
గరిష్ట/కనిష్ట స్థాయిలు: ఈ షేరు అక్టోబర్ 29, 2025న తన 52 వారాల గరిష్ట స్థాయి రూ. 290ని తాకింది.
మార్కెట్ క్యాపిటలైజేషన్: డిసెంబర్ 23, 2025 నాటికి కంపెనీ మార్కెట్ విలువ రూ. 17,341 కోట్లుగా ఉంది.
గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించి, సరైన నిర్ణయం తీసుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..