
భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని వార్తలు వెలువడాయి. కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వీరు విడిపోతున్నారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతుండగా, ఇటీవలే ఈ విషయం ధృవీకరించబడింది. బాంద్రా ఫ్యామిలీ కోర్టులో ఈ జంట తుది విచారణకు హాజరై, అవసరమైన లాంఛనాలు పూర్తి చేశారని నివేదికలు పేర్కొన్నాయి. అయితే, ధనశ్రీ న్యాయవాది అదితి మోహన్ దీనిపై స్పందిస్తూ, విచారణ ఇంకా కొనసాగుతుందని, మీడియాలో ప్రచారమవుతున్న కొన్ని కథనాలు నిరాధారమైనవని పేర్కొన్నారు. “కోర్టు విచారణ కొనసాగుతున్నందున, నేను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేను. చాలా తప్పుదారి పట్టించే సమాచారం ప్రచారంలో ఉంది, కాబట్టి మీడియా వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే నివేదించాలి” అని ఆమె స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, చాహల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రహస్య కోట్‌ను పోస్ట్ చేశాడు – “ఇది గందరగోళం, దయతో ఉండండి” అని మిచెల్ మెక్‌నమారా వ్యాఖ్యను పంచుకున్నాడు. ఈ సందేశం అతని వ్యక్తిగత పరిస్థితిని ప్రతిబింబిస్తున్నట్లు అనిపించింది. ఇదే సమయంలో, ధనశ్రీ రూ. 60 కోట్లు భరణం డిమాండ్ చేసిందని పుకార్లు వ్యాపించాయి. అయితే, ఆమె కుటుంబం ఈ వార్తలను పూర్తిగా ఖండించింది. “ఇలాంటి ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. తప్పుడు కథనాలను ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యం. ఇది కేవలం వారి కుటుంబాలను అనవసరమైన ఊహాగానాల్లోకి లాగుతోంది. మీడియా వాస్తవాలను ధృవీకరించకుండా ప్రచారం చేయరాదు” అని వారు పేర్కొన్నారు.
ఈ వివాదాల నడుమ, చాహల్ తన సోషల్ మీడియా ఖాతాలో మరొక సందేశాన్ని పోస్ట్ చేశాడు – “నేను లెక్కించలేనంత ఎక్కువ సార్లు దేవుడు నన్ను రక్షించాడు. నాకు తెలియని సమయాల్లో కూడా ఆయన సహాయం చేశాడు. దేవా, ఎల్లప్పుడూ నా కోసం ఉన్నందుకు ధన్యవాదాలు.” ఇది అతని మనోభావాలను ప్రదర్శించినట్లుగా అనిపించింది. ఇక ధనశ్రీ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో విశ్వాసం గురించి ఒక సందేశాన్ని పంచుకుంది – “ఒత్తిడి నుండి ఆశీర్వాదం వరకు. దేవుడు మన కష్టాలను ఆశీర్వాదాలుగా మార్చగలడని విశ్వాసం కలిగి ఉండటం అవసరం. మీరు ఒత్తిడికి గురైతే, దేవునిపై నమ్మకం ఉంచి ప్రతిదానిని ఆయనకు అప్పగించండి.”
ఈ వివాహ బంధం ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, చాహల్-ధనశ్రీ ఇద్దరూ తమ భావోద్వేగాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసుకుంటూ ఉన్నారు. అయితే, కోర్టు విచారణ ఇంకా కొనసాగుతుండటంతో, అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.