
Team India : భారత క్రికెట్ జట్టులో ఇంగ్లాండ్ టీ20 సిరీస్ ఓటమి తర్వాత తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శన పడిపోవడమే కాకుండా, తెరవెనుక కోచింగ్ స్టాఫ్‌లో కూడా పెద్ద ఎత్తున మార్పులు జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం, ప్రస్తుత సపోర్ట్ స్టాఫ్‌లోని ఇద్దరు ముఖ్యమైన సభ్యులు త్వరలోనే తమ పదవుల నుంచి తప్పుకోనున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఘోర పరాజయం తర్వాత, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పదవి, అతని పనితీరుపై కూడా బీసీసీఐ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి గంభీర్ కాంట్రాక్ట్ 2027 వరకు ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు బోర్డును ఆలోచనలో పడేశాయి.
గౌతమ్ గంభీర్ జూలై 2024లో భారత జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అతని మార్గదర్శకత్వంలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్లలో టైటిళ్లను గెలుచుకుని అద్భుత విజయాలను నమోదు చేసింది. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రికార్డు బాగున్నప్పటికీ, టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. దీనికి తోడు, ఇటీవల శ్రేయస్ అయ్యర్ భారత టీ20 జట్టుకు కెప్టెన్ అయినప్పటి నుంచి జట్టు వరుస పరాజయాలను మూటగట్టుకుంటోంది. గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాత సౌతాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోర్నే మోర్కెల్ వంటి వారిని కోచింగ్ స్టాఫ్‌లోకి తెచ్చినప్పటికీ, ఆశించిన ఫలితాలు రావడం లేదు.
ప్రముఖ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. టీమిండియా సపోర్ట్ స్టాఫ్ బీసీసీఐతో 2+1 సంవత్సరాల కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. అంటే రెండేళ్ల తర్వాత పరస్పర అంగీకారంతో మరో ఏడాది పొడిగించుకునే అవకాశం ఉంటుంది. అయితే, ప్రస్తుతం అందులో ఒక కోచ్ ఐపీఎల్ ఫ్రాంచైజీతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. గ్లోబల్ లీగ్స్‌లో జట్లు ఉన్న సదరు ఐపీఎల్ ఫ్రాంచైజీ వైపు వెళ్లేందుకే ఆయన మొగ్గు చూపుతున్నారట. అయితే, ఈ మార్పులకు ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన ఓటములు మాత్రమే కారణం కాదని, గత కొన్ని నెలలుగా డ్రెస్సింగ్ రూమ్‌లో అంతర్గత విభేదాలు నడుస్తున్నాయని తెలుస్తోంది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత సెలక్టర్లకు, కోచింగ్ స్టాఫ్‌కు మధ్య తీవ్ర మనస్పర్థలు వచ్చాయని, అది ఇప్పుడు కోచ్‌ల నిష్క్రమణకు దారితీసిందని నివేదికలు చెబుతున్నాయి.
ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన వెంటనే భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌కు టీమిండియా సరికొత్త కోచింగ్ స్టాఫ్‌తో వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, జింబాబ్వే పర్యటనకు హెడ్ కోచ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను పంపాలని బోర్డు యోచించడంపై కొందరు బీసీసీఐ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ సమయంలో గంభీర్‌కు ఇప్పటికే సుదీర్ఘ విరామం లభించిందని, అలాంటప్పుడు మళ్లీ రెస్ట్ ఇవ్వడం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా, లక్ష్మణ్‌ను ఆసియా క్రీడలకు పంపే ప్రణాళికలపై కూడా సందిగ్ధత నెలకొంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే, రాబోయే రోజుల్లో భారత క్రికెట్ బోర్డు భవిష్యత్తు అవసరాల కోసం కోచింగ్ విభాగంలో సరికొత్త ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నట్లు స్పష్టమవుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..