Indian Cricket Team: టీమిండియా తదుపరి కోచ్ ఎవరు? ఈ పెద్ద ప్రశ్నకు సమాధానం త్వరలో సమాధానం దొరకనుంది. టీమిండియా కొత్త కోచ్ కోసం అన్వేషణ మొదలు పెట్టింది. త్వరలో కొత్త కోచ్‌ను ప్రకటించే అవకాశం ఉంది. దీని కోసం దరఖాస్తులను ఆహ్వానించడానికి, ఈ వారం చివరిలోగా బీసీసీఐ ఓ ప్రకటన జారీ చేయవచ్చని తెలుస్తోంది. టీమిండియా ప్రధాన కోచ్‌తో పాటు, సహాయక సిబ్బందికి కూడా దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. భారత ప్రస్తుత ప్రధాన కోచ్ రవిశాస్త్రి, అతని సహాయక సిబ్బంది పదవీకాలం టీ20 ప్రపంచ కప్ తర్వాత ముగియనుంది.
టీమిండియా కొత్త కోచ్ కోసం అన్వేషణపై బీసీసీఐ అధికారి ఇన్‌సైడ్‌స్పోర్ట్.ఇన్‌తో మాట్లాడారు. “న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు మాకు కొత్త కోచ్‌తో పాటు సహాయక సిబ్బంది అందుబాటులోకి వస్తారు. దీని కోసం ఈ వారం చివరి నాటికి ఒక ప్రకటనను విడుదల చేసే అవకాశం ఉంది’ అని తెలిపారు. న్యూజిలాండ్‌తో భారత హోమ్ సిరీస్ నవంబర్ 17 నుంచి ప్రారంభం కానుంది. అంటే టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ దుబాయ్‌లో ముగిసిన 3 రోజుల తర్వాత ఈ సిరీస్ ఆడనుంది.
రవిశాస్త్రి స్థానంలో ఎవరు?
టీమిండియాలో ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్థానానికి చాలా మంది పోటీదారులు ఉన్నారు. రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ పేర్లు కూడా ఈ రేసులో వినిపించాయి. అయితే, ద్రవిడ్‌ని కోచ్‌గా చేసేందుకు అన్నీ సిద్ధంగా ఉన్నప్పటికీ, అతను ఈ పాత్ర పోషించేందుకు ఆసక్తి కనబరచడంలేదు. టీమిండియా ప్రధాన కోచ్ పాత్ర కోసం అనిల్ కుంబ్లే పేరు కూడా పరిశీలనలో ఉంది. కానీ, కుంబ్లే అయిష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది.
విదేశీయుల పేర్లు..
ఆస్ట్రేలియాకు చెందిన టామ్ మూడీ టీమిండియా కొత్త కోచ్ కావాలనే తన కోరికను వ్యక్తం చేసినట్లు సమాచారం. టామ్ మూడీ ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ డైరెక్టర్‌గా ఉన్నాడు. ఇది కాకుండా అతను శ్రీలంక క్రికెట్ డైరెక్టర్‌గా ఉన్నాడు. అంతకుముందు శ్రీలంకకు చెందిన మహేల జయవర్ధనే పేరు కూడా కోచ్‌గా వినిపించింది. అయితే, దీనిపై ఆయన అంతగా ఆసక్తిని చూపించడం లేదని తెలుస్తోంది.