
Retirement Policy : బీసీసీఐ రిటైర్డ్ భారతీయ క్రికెటర్ల కెరీర్‌కు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతోంది. భారత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత ఆటగాళ్లు విదేశీ టీ20 లేదా టీ10 లీగ్‌లలో చేరడాన్ని నియంత్రించేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది. ఆటగాళ్ల రిటైర్మెంట్ ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించడానికి, స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించడానికి బీసీసీఐ ప్రస్తుతం ఉన్న పాలసీలను నిశితంగా సమీక్షిస్తోంది. దీనివల్ల ఆటగాళ్లు రిటైర్మెంట్ నిర్ణయాలను తొందరపాటుతో కాకుండా చాలా ఆలోచించి తీసుకుంటారని బోర్డు భావిస్తోంది.
ప్రస్తుతం ఉన్న నిబంధనలు ఏమిటి?
ప్రస్తుత నిబంధనల ప్రకారం.. అంతర్జాతీయ లేదా దేశీయ క్రికెట్‌లో యాక్టివ్‌గా ఉన్న ఏ భారతీయ పురుష క్రికెటర్ కూడా విదేశాల్లో జరిగే ఎలాంటి టీ20 లీగ్‌లలో ఆడటానికి బీసీసీఐ అనుమతించదు. మన దేశీయ క్రికెట్ వ్యవస్థను, అలాగే ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐపీఎల్ టోర్నీ క్రేజ్‌ను కాపాడటానికి ఈ కఠినమైన నియమాన్ని ఎన్నో ఏళ్లుగా అమలు చేస్తున్నారు. ఒకవేళ ఏ ఆటగాడైనా విదేశీ లీగ్‌లలో ఆడాలనుకుంటే, అతను అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్, డొమెస్టిక్ క్రికెట్‌తో సహా భారత క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాల్సి ఉంటుంది.
ఐదేళ్ల కూలింగ్-ఆఫ్ పీరియడ్ ప్రతిపాదన
ఇటీవల జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ క్రిక్‌బజ్ సమాచారం ప్రకారం.. రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లకు కూలింగ్-ఆఫ్ పీరియడ్ ప్రవేశపెట్టాలని బోర్డు యోచిస్తోంది. ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం.. విదేశీ లీగ్‌లలో ఆడాలనే ఉద్దేశంతో భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చే ఆటగాళ్లు, తిరిగి భారత క్రికెట్ ఈవెంట్లలో లేదా కోచింగ్ వంటి పదవుల్లో భాగం పంచుకోవాలంటే కనీసం ఐదేళ్ల పాటు వేచి చూడాల్సి ఉంటుంది. అయితే, రిటైర్ అయిన తర్వాత ఎలాంటి విదేశీ లీగ్‌లలో ఆడకుండా ఉండే ఆటగాళ్లకు ఈ కాలపరిమితిని కేవలం ఒక ఏడాదికి తగ్గించే అవకాశం ఉంది.
బోర్డుకు కోపం తెప్పించిన ఆటగాళ్ల నిర్ణయాలు
ఇటీవలి కాలంలో కొందరు భారతీయ ఆటగాళ్లు తీసుకున్న నిర్ణయాలే బీసీసీఐ ఈ నిర్ణయం వైపు అడుగులు వేయడానికి కారణమయ్యాయి. ఉదాహరణకు, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎస్ భరత్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టంగా ప్రకటించలేదు. సాధారణంగా విదేశీ లీగ్‌లకు వెళ్లాలంటే ఐపీఎల్ నుంచి కూడా తప్పుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు అందుబాటులోకి వచ్చాడు. అక్కడ అతన్ని కాండీ రాయల్స్ జట్టు ఎంపిక చేసుకుంది. ఇలాంటి పరిణామాలు ఎక్కువవడంతోనే రూల్స్‌ను మరింత కఠినతరం చేయాలని బీసీసీఐ భావిస్తోంది.
గతంలోనూ విదేశీ లీగ్‌ల వైపు వెళ్లిన స్టార్స్
ఇలా భారత క్రికెట్‌కు దూరమై విదేశీ లీగ్‌ల వైపు వెళ్లడం ఇదే మొదటిసారి కాదు. గతంలో దినేష్ కార్తీక్, యువరాజ్ సింగ్, అన్ముక్త్ చంద్, ప్రవీణ్ తాంబే, ఇర్ఫాన్ పఠాన్ వంటి ప్రముఖ ఆటగాళ్లు కూడా భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాతే విదేశీ లీగ్‌లలో భాగమయ్యారు. అయితే అప్పట్లో ఇంత కఠినమైన ఆంక్షలు లేకపోవడంతో వారికి సులువయింది. కానీ ప్రస్తుత తరం ఆటగాళ్లు ఐపీఎల్ క్రేజ్ తగ్గిపోగానే, విదేశీ లీగ్‌ల వైపు మొగ్గు చూపుతుండటంతో బోర్డు దీనిని సీరియస్‌గా తీసుకుంది.
చిన్న దేశాల క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ భరోసా
ఒకవైపు ఆటగాళ్లపై ఆంక్షలు విధిస్తూనే, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ తన వంతు సహాయం అందిస్తోంది. అంతర్జాతీయ సహకారంలో భాగంగా ఫిజీ, మాల్దీవులు, పాపువా న్యూగినియా, నమీబియా వంటి చిన్న దేశాలలో క్రికెట్‌ను ప్రోత్సహించడానికి బోర్డు ప్రత్యేక సహాయ కార్యక్రమాలను ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా మాట్లాడుతూ.. చిన్న దేశాల్లో క్రికెట్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, అక్కడ శిక్షణా ప్రమాణాలను పెంచడానికి భారత నిపుణులను, కోచ్‌లను పంపుతున్నామని, కర్ణాటక, అస్సాం రాష్ట్ర జట్లు ఇప్పటికే నమీబియాలో పర్యటించాయని పేర్కొన్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..