Gautam Gambhir : గౌతమ్ గంభీర్ అవుట్..లక్ష్మణ్ ఇన్? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..ఆ వార్తలన్నీ అబద్ధమే!

Gautam Gambhir : సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ ఓడిపోవడంతో గంభీర్ కోచింగ్ శైలిపై విమర్శలు మొదలయ్యాయి. ఇదే అదనుగా గంభీర్‌ను కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌ (వన్డే, టీ20)కే పరిమితం చేసి, టెస్టులకు వీవీఎస్ లక్ష్మణ్‌ను కోచ్‌గా నియమించాలని బోర్డు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

Gautam Gambhir : గౌతమ్ గంభీర్ అవుట్..లక్ష్మణ్ ఇన్? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..ఆ వార్తలన్నీ అబద్ధమే!
Gautam Gambhir

Updated on: Dec 28, 2025 | 6:34 PM

Gautam Gambhir : టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చుట్టూ గత కొద్దిరోజులుగా నడుస్తున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. గంభీర్‌ను టెస్టు కోచ్ పదవి నుంచి తప్పిస్తున్నారని, ఆయన స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను నియమించబోతున్నారనే వార్తలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా స్పందించింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పడంతో గంభీర్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

పుకార్లకు చెక్ పెట్టిన బీసీసీఐ

సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ ఓడిపోవడంతో గంభీర్ కోచింగ్ శైలిపై విమర్శలు మొదలయ్యాయి. ఇదే అదనుగా గంభీర్‌ను కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌ (వన్డే, టీ20)కే పరిమితం చేసి, టెస్టులకు వీవీఎస్ లక్ష్మణ్‌ను కోచ్‌గా నియమించాలని బోర్డు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. “మీడియాలో వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహాగానాలే. లక్ష్మణ్‌ను సంప్రదించామన్న దాంట్లో వాస్తవం లేదు. గంభీర్ మూడు ఫార్మాట్లలో కోచ్‌గా కొనసాగుతారు” అని ఆయన స్పష్టం చేశారు.

లక్ష్మణ్ ఆసక్తి చూపలేదా?

నిజానికి బీసీసీఐలోని కొందరు అధికారులు లక్ష్మణ్‌తో అనధికారికంగా మాట్లాడారని సమాచారం. అయితే లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ బాధ్యతలను నిర్వహించడానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపడితే నిరంతరం ప్రయాణాలు చేయాల్సి ఉంటుందని, అందుకే ఆయన ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో గంభీర్‌పై ఒత్తిడి ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి ఆయన పదవికి ఎలాంటి ఢోకా లేదని అర్థమవుతోంది.

గంభీర్ ముందున్న సవాళ్లు

బీసీసీఐ మద్దతు తెలిపినప్పటికీ, గంభీర్ భవిష్యత్తు రాబోయే సిరీస్‌లపైనే ఆధారపడి ఉంటుంది. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు గంభీర్ ఒప్పందం ఉన్నప్పటికీ, మధ్యలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్ వంటి కీలక టోర్నీల్లో భారత్ ప్రదర్శన కీలకం కానుంది. ఒకవేళ ఇక్కడ కూడా జట్టు విఫలమైతే, బోర్డు తన నిర్ణయాన్ని పునరాలోచించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే గంభీర్ సేఫ్ జోన్ లోనే ఉన్నాడని చెప్పవచ్చు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..