
IPL 2027 : ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఐపీఎల్ 20వ సీజన్ నిర్వహణపై ఒక క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ 2027 టోర్నమెంట్‌ను ఎప్పటికంటే చాలా ముందే ప్రారంభించాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని నెలలుగా షెడ్యూల్ మారుతుందంటూ జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ, జూన్ 18 గురువారం నాడు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సరికొత్త డేట్స్‌ను అధికారికంగా ప్రకటించారు. వచ్చే సీజన్ మార్చి 10 నుంచే ప్రారంభం కాబోతోందని ఆయన స్పష్టం చేశారు.
మార్చి 10 నుంచి మే 15 వరకు సరికొత్త విండో
న్యూస్ ఏజెన్సీ పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. ఐపీఎల్ 2027 సీజన్ మార్చి 10న ప్రారంభమై మే 15 కల్లా ముగిసిపోతుందని వెల్లడించారు. అంటే ఈ మెగా లీగ్ మొత్తం 2 నెలల 7 రోజుల పాటు సాగనుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం ఐపీఎల్ మార్చి చివరి వారంలో మొదలై మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో ముగుస్తుంది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభమై మే 31న ముగిసింది. అయితే వచ్చే ఏడాది మాత్రం ఈ పాత పద్ధతికి స్వస్తి పలికి, టోర్నీని రెండు వారాల ముందుకు జరుపుతున్నారు.
షెడ్యూల్ మార్చడానికి బలమైన కారణం ఇదే
ఐపీఎల్ విండోను మార్చడానికి గల వాతావరణ కారణాలను దేవజిత్ సైకియా సుదీర్ఘంగా వివరించారు. “ఈ ఏడాది ఐపీఎల్ మే చివరి వరకు సాగింది. అయితే మే 15 తర్వాత దేశంలోని పలు ప్రాంతాలలో ముందస్తు రుతుపవనాల వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఇది మ్యాచ్‌ల నిర్వహణకు ఆటంకం కలిగిస్తుంది. దీనికి తోడు మే నెలలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిపోతోంది. ఈ భయంకరమైన వేడి వల్ల మైదానంలో ఆడే ఆటగాళ్లతో పాటు, స్టేడియానికి వచ్చి మ్యాచ్‌లు చూసే ప్రేక్షకులకు కూడా తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. అభిమానుల నుంచి మాకు ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. అందుకే క్రీడాకారుల ఆరోగ్యం, ఫ్యాన్స్ సౌకర్యం కోసం టోర్నీని మే 15 కల్లా ముగించేలా మా జనరల్ మేనేజర్ గేమ్స్ డెవలప్‌మెంట్‌కు ఆదేశాలు ఇచ్చాను” అని సైకియా పేర్కొన్నారు.
మ్యాచ్‌ల సంఖ్య పెంపు ప్రతిపాదనను తోసిపుచ్చిన బోర్డు
షెడ్యూల్ మార్పుతో పాటు, ఐపీఎల్ లో మ్యాచ్‌ల సంఖ్యను పెంచుతారనే వార్తలను దేవజిత్ సైకియా పూర్తిగా కొట్టిపారేశారు. ప్రస్తుతం ఐపీఎల్ లో ప్రతి జట్టు 14 గ్రూప్ మ్యాచ్‌లు ఆడుతుండగా, హోమ్ అండ్ అవే పద్ధతిలో దీన్ని 18 మ్యాచ్‌లకు పెంచాలని, తద్వారా మొత్తం మ్యాచ్‌ల కౌంట్‌ను 74 నుంచి 94కి మార్చాలనే ప్రతిపాదన బోర్డు ముందుకు వచ్చింది. దీనిపై సైకియా స్పందిస్తూ.. “ఇప్పటికిప్పుడు మ్యాచ్‌ల సంఖ్యను పెంచే ఆలోచన లేదు. చాలా మంది దీనిపై అడుగుతున్నారు కానీ 94 మ్యాచ్‌ల నిర్వహణ ప్రస్తుతానికి జరగని పని. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం కానీ, ఇప్పుడైతే 74 మ్యాచ్‌ల విధానమే కొనసాగుతుంది” అని తేల్చి చెప్పారు.
విదేశీ బోర్డుల బిజీ క్యాలెండర్ కూడా ఒక కారణమే
మ్యాచ్‌ల సంఖ్యను పెంచకపోవడం వెనుక అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్స్ కూడా ప్రధాన పాత్ర పోషించాయని బీసీసీఐ సెక్రటరీ తెలిపారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వంటి ప్రముఖ క్రికెట్ బోర్డుల ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడుతుంటారు. ఆయా దేశాలకు కూడా వారి వారి ద్వైపాక్షిక సిరీస్‌లు ఉంటాయి. ఒకవేళ ఐపీఎల్ మ్యాచ్‌లను పెంచితే టోర్నమెంట్ కాలపరిమితి పెరిగి, విదేశీ ఆటగాళ్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండటం కష్టమవుతుంది. అన్ని దేశాల ప్రయోజనాలను, ప్లేయర్ల బిజీ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకునే మ్యాచ్‌ల సంఖ్యను 74 వద్దే స్థిరంగా ఉంచినట్లు ఆయన స్పష్టం చేశారు.