
ICC World Cup Match Report, Bangladesh vs Afghanistan: జట్టు ఎంపిక నుంచే అంతర్గత వివాదాలతో ప్రపంచకప్ 2023లో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ జట్టు.. టోర్నీలో తొలి మ్యాచ్‌లోనే విజయంతో ప్రారంభించింది. షకీబ్ అల్ హసన్ సారథ్యంలోని బంగ్లాదేశ్ తన తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో ఏకపక్షంగా ఓడించింది. బంగ్లాదేశ్ విజయంలో కెప్టెన్ షకీబ్, ఆల్ రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ హీరోలుగా నిలిచారు. స్పిన్‌తో ఆఫ్ఘన్ బ్యాటింగ్‌ను నాశనం చేసి కేవలం 156 పరుగులకే కుదించింది. ఆపై మిరాజ్ హాఫ్ సెంచరీ చేసి జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ రెండు దక్షిణాసియా జట్లు ధర్మశాలలోని హెచ్‌పీసీఏ క్రికెట్ గ్రౌండ్‌లో శనివారం, అక్టోబర్ 7వ తేదీన ప్రపంచ కప్‌లో మూడో మ్యాచ్‌లో తలపడ్డాయి. ధర్మశాలలోని ఫాస్ట్ పిచ్‌పై స్పిన్-ఆల్ రౌండర్లతో నిండిన ఈ రెండు జట్ల మధ్య పోరుపై చాలా ఉత్సుకత నెలకొంది. ముఖ్యంగా ప్రపంచకప్ ప్రారంభానికి ముందు కెప్టెన్ షకీబ్ అల్ హసన్, మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ మధ్య మాటల యుద్ధంలో చిక్కుకున్న బంగ్లాదేశ్ జట్టుపై అందరి దృష్టి నెలకొంది. ఈ ప్రపంచకప్‌లో తమీమ్‌కు జట్టులో చోటు దక్కలేదనే సంగతి తెలిసిందే.
కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు కేవలం 37.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బంగ్లాదేశ్ 34.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
బంగ్లాదేశ్ తరఫున నజ్ముల్ హుస్సేన్ శాంటో, మెహదీ హసన్ మిరాజ్ అర్ధ సెంచరీలు ఆడారు. నజ్ముల్ హుస్సేన్ శాంటో నాటౌట్ 57 పరుగులు చేశాడు. అతనితో పాటు మిరాజ్ 73 బంతుల్లో 57 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. అఫ్గానిస్థాన్ తరపున అజ్మతుల్లా ఒమర్‌జాయ్, నవీన్ ఉల్ హక్, ఫజల్‌హక్ ఫరూకీ ఒక్కో వికెట్ తీశారు.
ఆఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్-11: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబుల్ ఉర్ రెహక్మాన్, ఫరూల్ హుక్వీన్ ..
బంగ్లాదేశ్ ప్లేయింగ్-11: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, లిటన్ దాస్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, మెహదీ హసన్ మిరాజ్, షఫీకర్ రహీమ్ (వికెట్), తౌహీద్ హృదయ్, మహ్మదుల్లా రియాద్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..