
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే రెండో టీ20 మ్యాచ్‌కు ముందు మెల్‌బోర్న్ క్రికెట్‌లో విషాదం చోటుచేసుకుంది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోబాల్ తగిలి తీవ్రంగా గాయపడిన యువ క్రికెటర్ బెన్ ఆస్టిన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. బెన్ ఆస్టిన్ ఫెర్న్‌ట్రీ గల్లీ క్రికెట్ క్లబ్ తరపున ఆడేవాడు. అక్టోబర్ 28న ఆస్టిన్ నెట్స్‌లో బౌలింగ్ మెషిన్ సహాయంతో ప్రాక్టీస్ చేస్తున్నాడు. హెల్మెట్ ధరించినప్పటికీ.. బంతి వేగంగా దూసుకొచ్చి వచ్చి అతని మెడను బలంగా తాకింది. తీవ్రంగా గాయపడిన ఆస్టిన్‌ను వెంటనే అంబులెన్స్‌లో సమీపంలోని మోనాష్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆస్టిన్.. చివరకు అక్టోబర్ 30న ఆసుపత్రిలో తుది శ్వాస విడిచాడు.
ఈ యువ క్రికెటర్ మరణం గురించి ఆ క్లబ్ అక్టోబర్ 30 ఉదయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘యువ క్రికెటర్ బెన్ ఆస్టిన్ మరణంతో మేము తీవ్ర బాధకు లోనయ్యాము. ఈ విషాద సంఘటన మొత్తం క్రికెట్ సమాజాన్ని దుఃఖంలో ముంచెత్తింది. ఈ క్లిష్ట సమయంలో మేము అతని కుటుంబానికి అండగా ఉంటాం’’ అని తెలిపింది.
యువ క్రికెటర్ బెన్ ఆస్టిన్ మరణం దాదాపు ఒక దశాబ్దం క్రితం జరిగిన ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఫిల్ హ్యూస్ విషాదకర సంఘటనను మళ్లీ గుర్తుకు తెచ్చింది. 2014లో షెఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫిల్ హ్యూస్ మెడకు బంతి తగిలి మరణించాడు. హ్యూస్ మరణం తర్వాత క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ భద్రతపై, ముఖ్యంగా మెడ భాగం రక్షణపై మరింత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలైంది. అయినప్పటికీ బెన్ ఆస్టిన్ విషయంలో ఇలాంటి విషాదం జరగడం క్రీడా ప్రపంచాన్ని కలచివేసింది.