Australia Team: ఆస్ట్రేలియా జట్టు ఫిబ్రవరిలో భారత్‌లో పర్యటించాల్సి ఉంది. ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. సాధారణంగా టెస్టు సిరీస్‌కు ముందు విజిటింగ్ టీమ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. కానీ, ఈసారి ఆస్ట్రేలియా టీం మాత్రం మరో ప్లాన్‌తో రంగంలోకి దిగనుందంట. ఫిబ్రవరి-మార్చిలో భారత్‌తో జరగనున్న నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో కొత్త వ్యూహంతో బరిలోకి దిగుతామని టీమ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ అభిప్రాయపడ్డాడు. 19 ఏళ్లుగా భారత్‌లో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ గెలవలేదు. అందుకోసమే ఈసారి ఇలా ప్లాన్ చేసినట్లు తెలిపాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా వార్మప్ మ్యాచ్‌ను ఆడే అవకాశం లేదు. ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభమయ్యే మొదటి టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌కు ఒక వారం ముందు మాత్రమే ఆస్ట్రేలియా జట్టు భారతదేశానికి చేరుకుంటుంది. భారత్‌కు వెళ్లి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడడం, పరిస్థితులకు తగ్గట్టుగా ఉండటం కంటే మానసికంగా, శారీరకంగా తాజాగా ఉండటమే ముఖ్యమని మెక్‌డొనాల్డ్ పేర్కొన్నాడు.
సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ప్రకారం, మెక్‌డొనాల్డ్ మాట్లాడుతూ, ‘విదేశీ పర్యటనలలో గత కొన్ని సిరీస్‌లలో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడకుండా ఉండాలనే వ్యూహాన్ని మేము అనుసరించాం. మా జట్టుకు అలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం లేదని భావిస్తున్నాం. తొలి టెస్టు మ్యాచ్‌కు వారం రోజుల ముందు మాత్రమే భారత్‌కు వెళతాం. సన్నాహాల్లో ఎక్కువ సమయం వెచ్చించకూడదనుకుంటున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు.
గత ఏడాది మార్చిలో పాకిస్థాన్ పర్యటనలో ఆస్ట్రేలియా అనుసరించిన ఇదే విధమైన వ్యూహం ప్రభావవంతంగా నిరూపితమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. మెక్‌డొనాల్డ్ మాట్లాడుతూ, నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సన్నద్ధత, పూర్తి చేయడానికి వారం సమయం సరిపోతుందని మేం భావిస్తున్నాం. సిరీస్ సమయంలో ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. ఇలా చేయడం ద్వారానే పాకిస్థాన్‌లో విజయం సాధించాం. తొలి మ్యాచ్‌కు ముందు అక్కడ చాలా తక్కువ సమయం గడిపాం. ఈసారి, భారత పర్యటనకు ముందు, బిగ్ బాష్ లీగ్‌లో ఆడని ఆటగాళ్ల కోసం సిడ్నీలో మూడు రోజుల క్యాంప్ ఏర్పాటు చేయాలని ఆస్ట్రేలియా ప్లాన్ చేసింది.
ఆస్ట్రేలియా చివరిసారిగా 2004-05లో ఆడమ్ గిల్‌క్రిస్ట్ నేతృత్వంలో భారత్‌లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. 2017లో పూణెలో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను గెలుచుకునే స్థితిలో ఉన్నా.. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు అద్భుతమైన పునరాగమనం చేసి 2-1తో సిరీస్‌ను గెలుచుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..