Asia Cup 2025: పోరాడి ఓడిన ఒమన్‌.. టీమిండియాకు హ్యాట్రిక్‌ విక్టరీ! ఇక ఆదివారం పాక్‌తో పోరు

ఆసియా కప్ 2025లో భారత జట్టు ఒమన్‌పై గెలుపొంది సూపర్ ఫోర్ దశకు అర్హత సాధించింది. టీమిండియా 189 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఒమన్ 167 పరుగులు చేసింది. సంజు శాంసన్ (56) అభిషేక్ శర్మ (38) భారత జట్టుకు మంచి స్కోర్ అందించారు. ఒమన్‌ ఓపెనర్లు అమీర్ కలీమ్ (64), జితేందర్ సింగ్ (32) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు.

Asia Cup 2025: పోరాడి ఓడిన ఒమన్‌.. టీమిండియాకు హ్యాట్రిక్‌ విక్టరీ! ఇక ఆదివారం పాక్‌తో పోరు
Ind Vs Oman

Updated on: Sep 20, 2025 | 12:20 AM

ఆసియా కప్‌ 2025లో భాగంగా శుక్రవారం ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్‌ ఏలో ఓటమి ఎరుగని జట్టుగా సూపర్‌ ఫోర్‌కు వెళ్లింది. యూఏఈ, పాకిస్థాన్‌, ఒమన్‌ జట్లపై టీమిండియా హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసింది. కాగా, టీమిండియాకు ఒమన్‌ గట్టి పోటీనే ఇచ్చింది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో ఆల్‌మోస్ట్‌ టీమిండియా ఇచ్చిన టార్గెట్‌కు చాలా దగ్గరగానే వచ్చింది. కేవలం 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. పైగా టీమిండియా బౌలర్లు ఒమన్‌ బ్యాటర్లను నలుగురిని మాత్రమే ఔట్‌ చేయగలిగారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. సంజు శాంసన్‌ 45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 56 పరుగులు చేసి రాణించాడు. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ 15 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సులతో 38 పరుగులు చేసి దడదడలాడించాడు. అలాగే అక్షర్‌ పటేల్‌ 26, తిలక్‌ వర్మ 29 రన్స​్‌తో పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మిగతా వారికి అవకాశం ఇస్తూ అతను బ్యాటింగ్‌కు రాలేదు. ఒమన్‌ బౌలర్లలో షా ఫైసల్‌ 2, జితెన్‌ 2, అమీర్‌ కలీమ్‌ 2 వికెట్లు తీసుకున్నారు.

ఇక 189 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఒమన్‌ టీమిండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. ముఖ్యంగా ఓపెనర్లు అయితే పవర్‌ ప్లేలో టీమిండియా బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. 20 ఓవర్లు పూర్తిగా ఆడిన ఒమన్‌ కేవలం నాలుగంటే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయింది. మొత్తం 167 పరుగులు చేసి విజయానికి 21 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఒమన్‌ ఓపెనర్‌ జితేందర్‌ సింగ్‌ 33 బంతుల్లో 32, మరో ఓపెనర్‌ అమీర్‌ కలీమ్‌ 46 బంతుల్లో 64, వన్‌డౌన్‌లో వచ్చిన మీర్జా 33 బంతుల్లో 51 పరుగులు చేసి టీమిండియా బౌలర్లు సమర్థవంతంగా ఆడారు. ఒమన్‌ టాపార్డర్‌ పోరాటానికి అంతా ఫిదా అయ్యారు. అయితే చివర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఒమన్‌కు ఓటమి తప్పలేదు. మొత్తంగా ఈ ఆసియా కప్‌లో టీమిండియా గ్రూప్‌ స్టేజ్‌లో మూడు విజయాలతో సూపర్‌ ఫోర్‌కు వెళ్తే, ఒమన్‌ మూడు ఓటములతో టోర్నీని ముగించింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి