Ind vs Pak, Asia Cup 2022: ఆసియా కప్ ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది.ఆదివారం చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చివరి ఓవర్ లో సిక్స్ కొట్టి భారత జట్టు విజయాన్ని ఖరారుచేశాడు. తద్వారా గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో పాక్‌చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. 147 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా మొదటి ఓవర్లోనే కేఎల్ రాహుల్ వికెట్ ను కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. అయితే కోహ్లీ (35), రవీంద్ర జడేజా (35), హార్దిక్ పాండ్యా(33 నాటౌట్) భారత జట్టును విజయతీరాలకు చేర్చారు. ముఖ్యంగా హార్దిక్ దూకుడైన బ్యాటింగ్‌తో టీమిండియా విజయాన్ని తేలిక చేశాడు. బౌలింగ్‌లోనూ మూడు వికెట్లు తీసిన అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.
ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అతని నిర్ణయం సరైనదని బౌలర్లు నిరూపించారు. పరుగులు నియంత్రించడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీశారు. దీంతో పాక్ 19.5 ఓవర్లలో 147 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో మహమ్మద్ రిజ్వాన్ (43), ఇఫ్తికార్ అహ్మద్ (28) మాత్రమే రాణించారు. అయితే లక్ష్య ఛేదనలో టీమిండియాకు కూడా పేలవమైన ఆరంభం లభించింది. మొదటి ఓవర్లోనే కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోయింది. పాకిస్థాన్ తరఫున అరంగేట్రం చేసిన 19 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ నసీమ్.. ఇన్నింగ్స్ రెండో బంతికి కేఎల్ రాహుల్‌ను బౌల్డ్ చేశాడు. అయితే కోహ్లీ, రోహిత్ (13) 49 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. కోహ్లి కొన్నిమంచి షాట్లు ఆడినా రోహిత్ మంచి టచ్‌లో కనిపించలేదు. ఈక్రమంలో ఎనిమిదో, 10వ ఓవర్లలో ఇద్దరి వికెట్లు నేలకూల్చి పాక్ మళ్లీ గేమ్‌లోకి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో రవీంద్ర జడేజా ముందుండి జట్టును నడిపించాడు. సూర్యతో కొన్ని పరుగులు జోడించాడు. అయితే నసీమ్ షా తన రెండవ స్పెల్‌లో తిరిగి వచ్చిన వెంటనే సూర్యను బౌల్డ్ చేశాడు. 15వ ఓవర్ ముగిసే సరికి భారత్ కేవలం 89 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో జడేజా, హార్దిక్ కలిసి జట్టును కష్టాల నుంచి గట్టెక్కించే బాధ్యతను తీసుకున్నారు. 18వ ఓవర్‌లో నసీమ్ షా ఓవర్‌లో జడేజా ఒక ఫోర్, సిక్సర్ బాదగా, ఆ తర్వాతి ఓవర్‌లోనే హార్దిక్ మూడు ఫోర్లు బాది భారత్ విజయాన్ని ఖాయం చేశాడు. అయితే చక్కటి ఇన్నింగ్స్‌ఆడిన జడేజా ఆఖరి ఓవర్ తొలి బంతికే అవుటయ్యాడు. దీంతో మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగింది. అయితే హార్దిక్ సిక్సర్ తో మ్యాచ్ ను ముగించాడు.
WHAT. A. WIN!#TeamIndia clinch a thriller against Pakistan. Win by 5 wickets ??
Scorecard – https://t.co/o3hJ6VNfwF #INDvPAK #AsiaCup2022 pic.twitter.com/p4pLDi3y09
— BCCI (@BCCI) August 28, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..