
Ashes 2025-26 : మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు క్రీడా ప్రపంచంలో పెను సంచలనంగా మారింది. స్టేడియంలో పరుగుల వరద పారుతుందని ఆశించిన అభిమానులకు, అక్కడ బౌలర్ల ప్రతాపం చూసి మైండ్ బ్లాక్ అవుతోంది. కేవలం 109 ఓవర్ల ఆటలోనే ఏకంగా 30 వికెట్లు నేలకూలడం చూస్తుంటే, అది క్రికెట్ పిచ్ లా ఉందా లేక బౌలర్ల వేటా స్థలమా అనే అనుమానం కలుగుతోంది. పిచ్‌పై విపరీతంగా ఉన్న గడ్డి కారణంగా బ్యాటర్లు క్రీజులో నిలబడటమే గగనమైపోతోంది.
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పిచ్ ఇప్పుడు తీవ్ర విమర్శల పాలవుతోంది. ఈ మ్యాచ్‌లో వరుసగా మూడు ఇన్నింగ్స్‌లు కేవలం ఐదు సెషన్లలోనే ముగిసిపోయాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏ జట్టు కూడా 200 పరుగుల మార్కును అందుకోలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 152 పరుగులకే ఆలౌట్ కాగా, సమాధానంగా ఇంగ్లాండ్ కేవలం 110 పరుగులకే చేతులెత్తేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 132 పరుగులకే పరిమితమై, ఇంగ్లాండ్‌కు 175 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒక్క బ్యాటర్ కూడా కనీసం హాఫ్ సెంచరీ చేయలేకపోవడం ఈ పిచ్ స్వభావాన్ని తెలియజేస్తోంది.
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఈ పిచ్‌పై సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. “ఈ పిచ్ ఒక జోక్.. ఇది టెస్ట్ క్రికెట్ గౌరవాన్ని తగ్గిస్తోంది. ఆటగాళ్లకు, బ్రాడ్‌కాస్టర్లకు, ముఖ్యంగా టికెట్లు కొనుక్కున్న అభిమానులకు ఇది తీరని అన్యాయం” అని ఆయన మండిపడ్డారు. సాధారణంగా పిచ్‌పై 7 మిల్లీమీటర్ల గడ్డి ఉంటేనే బంతి బాగా స్వింగ్ అవుతుంది, కానీ మెల్బోర్న్ క్యూరేటర్ ఏకంగా 10 మిల్లీమీటర్ల గడ్డిని వదిలేయడమే ఈ వినాశనానికి కారణమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనివల్ల బంతి అనూహ్యంగా కదులుతూ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తోంది.
మరో మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ కూడా ఈ వివాదంలోకి దూకారు. “భారతదేశంలో పిచ్‌లపై బంతి టర్న్ అయితే చాలు విమర్శలు చేసే విదేశీయులు, ఇప్పుడు ఆస్ట్రేలియా పిచ్‌పై నోరు ఎందుకు విప్పడం లేదు? భారత్‌కు ఒక న్యాయం, ఆస్ట్రేలియాకు ఒక న్యాయమా?” అంటూ ఐసీసీని ప్రశ్నించారు. పిచ్‌లను రేటింగ్ ఇచ్చే సమయంలో వివక్ష చూపకూడదని ఆయన డిమాండ్ చేశారు. రెండు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ముగిసేలా ఉండటంతో, పిచ్ క్యూరేటర్ పనితీరుపై ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..