IND vs AFG : హిట్‌మ్యాన్ ఇచ్చిన టిప్స్‌తో ఇండియాకే స్కెచ్.. అఫ్గాన్ మిస్టరీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు!

IND vs AFG : ముంబై ఇండియన్స్‌లో రోహిత్ శర్మ నుంచి నేర్చుకున్న రహస్యాలను ఇప్పుడు టీమిండియాపైనే ప్రయోగిస్తానంటూ అఫ్గానిస్తాన్ యువ స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్-అఫ్గాన్ వన్డే సిరీస్‌కు ముందు అతడి మాటలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

IND vs AFG : హిట్‌మ్యాన్ ఇచ్చిన టిప్స్‌తో ఇండియాకే స్కెచ్.. అఫ్గాన్ మిస్టరీ స్పిన్నర్  సంచలన వ్యాఖ్యలు!
Rohit Sharma

Updated on: Jun 10, 2026 | 6:03 PM

IND vs AFG : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున రోహిత్ శర్మతో కలిసి ఆడిన అఫ్గానిస్తాన్ యువ స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్ ఇప్పుడు భారత జట్టుకే సవాల్ విసురుతున్నాడు. జూన్ 13 నుంచి ధర్మశాల వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మాట్లాడిన ఈ 19 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్.. ఐపీఎల్ సమయంలో రోహిత్ శర్మ దగ్గర నేర్చుకున్న మెళకువలను, రహస్యాలను ఇప్పుడు భారత బ్యాటర్లపైనే ప్రయోగించడానికి ఎదురుచూస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించాడు.

ముంబై ఇండియన్స్ నెట్ ప్రాక్టీస్ సమయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ అయిన రోహిత్ శర్మకు నిరంతరం బౌలింగ్ చేసే అవకాశం గజన్‌ఫర్‌కు దక్కింది. ఈ అనుభవం ప్రపంచ స్థాయి బ్యాటర్లను ఎలా ఎదుర్కోవాలో, వారి బలహీనతలు ఏమిటో అర్థం చేసుకోవడానికి తనకు ఎంతగానో ఉపయోగపడిందని ఈ యువ స్పిన్నర్ తెలిపాడు. రోహిత్ భాయ్ ఒక గొప్ప ఆటగాడని, అతను ఇన్నింగ్స్ ప్రారంభిస్తే తాను కొత్త బంతితో బౌలింగ్ చేస్తానని చెప్పాడు. ఐపీఎల్‌లో అతని నుంచి నేర్చుకున్న ప్రతి విషయాన్ని, దేవుడి దయతో రాబోయే సిరీస్‌లో మా జట్టు ప్రయోజనం కోసం వాడుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.

ఐపీఎల్ డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ శర్మ కేవలం బౌలింగ్ గురించే కాకుండా, వ్యక్తిగతంగా తన బ్యాటింగ్ మెరుగుపరుచుకోవడానికి కూడా సలహాలు ఇచ్చాడని గజన్‌ఫర్ గుర్తుచేసుకున్నాడు. తాను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రోహిత్ దగ్గరుండి కొన్ని ముఖ్యమైన సూచనలు చేశాడని, ఆ మాటలకు తాను ఎల్లప్పుడూ కృతజ్ఞతుడిగా ఉంటానని చెప్పాడు. ముంబై ఇండియన్స్ క్యాంపులో జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లతో గడపడం తన కెరీర్‌ను మలుపు తిప్పిందని, క్రికెట్ అనేది నిరంతరం నేర్చుకునే ప్రక్రియ అని అతను చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం భారతదేశంలో ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ, తాము ఇక్కడి వాతావరణానికి పూర్తిగా అలవాటు పడ్డామని గజన్‌ఫర్ తెలిపాడు. ఐపీఎల్ కారణంగా ఆటగాళ్లంతా ఫుల్ ఫామ్‌లో ఉన్నారని, ఈ సిరీస్ కోసం తమ దేశంలో కాకుండా ప్రత్యేకంగా కాబుల్‌లో నెల రోజుల పాటు ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించామని వెల్లడించాడు. అక్కడి పిచ్‌లు, ఇక్కడి పిచ్‌లు ఒకేలా ఉండటం వల్ల తమ జట్టు ఆటగాళ్లంతా మంచి జోష్‌లో ఉన్నారని, భారత బలమైన బ్యాటింగ్ లైనప్‌ను ఢీకొట్టడానికి తమ వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశాడు.

అఫ్గానిస్తాన్ క్రికెట్‌లో ప్రస్తుతం పోటీ చాలా పెరిగిపోయిందని, దేశీయ స్థాయి నుంచి నేరుగా అంతర్జాతీయ జట్టులోకి రావడం ఇప్పుడు చాలా కష్టంగా మారిందని గజన్‌ఫర్ అన్నాడు. అయితే కష్టపడే తత్వం ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించామన్నాడు. చాలామంది యువ ఆటగాళ్లకు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ రోల్ మోడల్స్ అయినప్పటికీ, తనకు మాత్రం మొత్తం అఫ్గానిస్తాన్ జట్టే పెద్ద ప్రేరణ అని చెప్పాడు. చిన్నప్పటి నుంచి తమ జాతీయ జట్టు ఆడే విధానాన్ని చూస్తూనే తామంతా పెరిగామని ఎమోషనల్ అయ్యాడు. ఈ సిరీస్ నుంచి హార్దిక్ పాండ్యా దూరమవ్వడం భారత్‌కు కాస్త మైనస్ అయినప్పటికీ.. అఫ్గాన్ స్పిన్ మాయాజాలాన్ని భారత బ్యాటర్లు ఎలా తట్టుకుంటారో చూడాలి మరి.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us