Ajinkya Rahane: రిటైర్మెంట్ తర్వాత రహానే కొత్త అవతారం.. ఇక మైక్ పట్టుకుని అదరగొట్టనున్న మాజీ కెప్టెన్

Ajinkya Rahane: రిటైర్మెంట్ తర్వాత టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. భారత్-శ్రీలంక టెస్టు సిరీస్‌తో సోనీ స్పోర్ట్స్ కామెంట్రీ ప్యానెల్‌లోకి అడుగుపెట్టనున్నాడు. ఇదిలా ఉంటే గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన వాషింగ్టన్ సుందర్ రెండో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.

Ajinkya Rahane: రిటైర్మెంట్ తర్వాత రహానే కొత్త అవతారం.. ఇక మైక్ పట్టుకుని అదరగొట్టనున్న మాజీ కెప్టెన్
Ajinkya Rahane

Updated on: Aug 12, 2026 | 2:34 PM

Ajinkya Rahane: టీమిండియా తరఫున దాదాపు పదిహేనేళ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించిన మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఇటీవలే అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి, కష్ట సమయాల్లో జట్టుకు కొండంత అండగా నిలిచిన రహానే ఇటు ఐపీఎల్‌లోనూ పలు జట్లకు ప్రాతినిధ్యం వహించి సక్సెస్ అయ్యాడు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రహానే ఏం చేయబోతున్నాడనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఆ ప్రశ్నలకు సమాధానం లభించింది. ఆటగాడిగా మైదానంలో రానించిన ఆయన, ఇప్పుడు కామెంట్రీ బాక్స్‌లోకి అడుగుపెట్టి తన మైక్ పవర్‌ను చూపించబోతున్నాడు.

సోనీ స్పోర్ట్స్ ప్యానెల్‌లోకి రహానేకు స్వాగతం

మరో మూడు రోజుల్లో ప్రారంభం కాబోతున్న భారత్, శ్రీలంక టెస్టు సిరీస్ ద్వారా రహానే కామెంటేటర్‌గా అరంగేట్రం చేయనున్నాడు. ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ తమ కామెంట్రీ టీంలోకి రహానేను సాదరంగా ఆహ్వానించింది. ఈ విషయాన్ని సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్స్ సీఆర్‌వో, బిజినెస్ హెడ్ రాజేష్ కౌల్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. రహానే వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు కామెంట్రీ ప్యానెల్‌లో చేరడం తమకు, అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు.

కొత్త బాధ్యతపై అజింక్య రహానే ఆనందం

వ్యాఖ్యాతగా మారడంపై రహానే స్పందిస్తూ.. “భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు కామెంటర్ గా నా ప్రయాణం ప్రారంభించడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. నా దృష్టిలో క్రికెట్‌లో టెస్టు ఫార్మాట్‌కు సాటి లేదు. టీమిండియా తరఫున ఇన్నేళ్ల పాటు సుదీర్ఘంగా టెస్టులు ఆడాను. ఇప్పుడు అదే ఆటను ఒక మైక్రోఫోన్ ముందు నిలబడి వేరే కోణంలో విశ్లేషించబోతున్నాను. నా ఆన్-ఫీల్డ్ అనుభవాలు, ఆటలోని కీలక మలుపులు, వ్యూహాలను అభిమానులతో పంచుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను” అని తెలిపారు.

రెండో టెస్టుకు కూడా వాషింగ్టన్ సుందర్ దూరం?

మరోవైపు శ్రీలంక పర్యటనకు సంబంధించి టీమిండియాను గాయాల సమస్య వేధిస్తోంది. గాయం కారణంగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తొలి టెస్టుకు ఎంపిక కాలేదు. రెండో మ్యాచ్ సమయానికల్లా కోలుకుంటాడని భావించి ఆ మ్యాచ్ స్క్వాడ్‌లో అతని పేరును చేర్చినప్పటికీ, ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఆయన రెండో టెస్టు కూడా ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. సుందర్ ఇంకా పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించకపోవడమే దీనికి కారణం. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుండగా, ఆగస్టు 23 నుంచి రెండో టెస్టు కొలంబో వేదికగా జరగనుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us