Champions Trophy: సంచలనం.. ఇంగ్లండ్‌ను ఇంటికి పంపిన ఆఫ్ఘానిస్థాన్‌! కన్నీళ్లు పెట్టుకున్న దిగ్గజ క్రికెటర్‌

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్‌ ఇంగ్లాండ్‌పై షాకింగ్ విజయం సాధించింది. ఇబ్రహీం జద్రాన్ సెంచరీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ అద్భుత బౌలింగ్‌తో ఆఫ్ఘనిస్తాన్ 325 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ 317 పరుగులకే ఆలౌట్ అయింది. అజ్మతుల్లా 5 వికెట్లు తీసుకున్నాడు. ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్‌ సెమీఫైనల్స్‌కు చేరే అవకాశాలు మెరుగయ్యాయి.

Champions Trophy: సంచలనం.. ఇంగ్లండ్‌ను ఇంటికి పంపిన ఆఫ్ఘానిస్థాన్‌! కన్నీళ్లు పెట్టుకున్న దిగ్గజ క్రికెటర్‌
Afghanistan Vs England

Updated on: Feb 27, 2025 | 6:43 AM

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో సంచలనం నమోదు అయ్యాయి. గ్రూప్‌ బీలో పసికూనగా ఉన్న ఆఫ్ఘానిస్థాన్‌ టైటిల్‌ ఫేవరేట్‌గా ఉన్న ఇంగ్లండ్‌కు ఊహించని షాకిచ్చింది. గ్రూప్‌ బీ నుంచి ఎలిమినేట్‌ అయిన తొలి టీమ్‌గా ఇంగ్లండ్‌ టీమ్‌ నిలిచింది. బుధవారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌.. చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగింది. ఈ హై స్కోరింగ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలుస్తుందని అనిపించినప్పటికీ.. ఆఫ్ఘానిస్థాన్‌ చివర్లో ఒత్తిడిని తట్టుకుంటూ అద్భుత ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా అజ్మతుల్లా ఒమర్జా్య్‌ సూపర్‌ బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను ఇంటికి పంపించాడు.

సెంచరీ పూర్తి చేసుకొని క్రీజ్‌లో ఉన్న ఇంగ్లండ్‌ సీనియర్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ను అవుట్‌ చేసి మ్యాచ్‌ను ఆఫ్ఘాన్‌ వైపు తిప్పేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఏకంగా 5 వికెట్ల హాల్‌ సాధించి.. ఆప్ఘాన్‌కు హీరో అయ్యాడు. అంతకంటే ముందు ఇబ్రహీం జద్రాన్‌ భారీ సెంచరీతో ఆఫ్ఘాన్‌కు భారీ స్కోర్‌ అందించాడు. బ్యాటింగ్‌ పిచ్‌పై ఇంగ్లండ్‌ ఆ స్కోర్‌ను ఛేదిస్తుంది అనుకున్నప్పటికీ.. ఆఫ్ఘాన్‌ బౌలర్లు అద్భుతం చేసి చూపించారు. ఇక ఈ నెల 28న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో ఆఫ్ఘాన ఇలాంటి అద్భుతమే చేస్తే సెమీస్‌ చేరుతుంది. లేదా ఆసీస్‌తో మ్యాచ్‌ రద్దు అయి, ఇంగ్లండ్‌ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోతే రన్‌రేట్‌ ఆధారంగా కూడా సెమీస్‌ చేరే అవకాశం ఉంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘానిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ 146 బంతుల్లో 12 ఫోర్లు 6 సిక్సులతో 177 పరుగుల భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు. అలాగే కెప్టెన్‌ షాహిదీ 40, అజ్మతుల్లా ఒమర్జాయ్‌ 41, సీనియర్‌ ప్లేయర్‌ నబీ 40 పరుగులతో రాణించడంతో ఆఫ్ఘాన్‌ భారీ స్కోర్‌ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ , లివింగ్‌స్టన్‌ 2, ఓవర్టన్‌, ఆదిల్‌ రషీద్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు. ఇక భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే అజ్మతుల్లా, నబీ భారీ షాక్‌ ఇచ్చారు. ఓపెనర్‌ ఫిలిప్‌ సాల్ట్‌, వన్‌డౌన్‌లో వచ్చిన స్మిత్‌లను వెంటవెంటనే అవుట్‌చేశారు. దీంతో ఇంగ్లండ్‌ కేవలం 30 పరుగులకే 2 వికెట్ల కోల్పోయింది. ఆ తర్వాత సీనియర్‌ బ్యాటర్‌ జో రూట్‌ ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత తీసుకున్నాడు.

ఓపెనర్‌ బెన్‌ డకెట్‌తో కలిసి 50కి పైగా పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. ఆ తర్వాత వరుస విరామాల్లో ఇంగ్లండ్‌ వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఇక ఎండ్‌లో జో రూట్‌ క్రీజ్‌లో పాతుకపోయినా.. మరో ఎండ్‌లో బ్రూక్‌, బట్లర్‌ రాణించినా ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. చివర్లో ఓవర్టన్‌ 32 పరుగులతో రాణించినా కీలక సమయంలో అవుట్‌ కావడంతో ఆఫ్ఘాన్‌ మరింత పట్టు బిగించింది. మొత్తం ఇంగ్లండ్‌ 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆఫ్ఘాన్‌ 8 పరుగుల తేడాతో విజయం సాధించి, ఛాంపియన్స్‌ ట్రోఫీలో చరిత్ర సృష్టించింది. ఆఫ్ఘాన్‌ బౌలర్లలో అజ్మతుల్లా 5, మొహమ్మద్‌ నబీ 2, ఫరూఖీ, రషీద్‌ ఖాన్‌, గుల్బద్దీన్‌ నైబ్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు. ఈ ఓటమితో ఇంగ్లండ్‌ సీనియర్‌ ప్లేయర్‌ జో రూట్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. సెంచరీతో రాణించినా జట్టును గెలిపించలేకపోయినా బాధ అతని ముఖంలో కనిపించింది. అలాగే రూట్‌కు ఇదే చివరి ఛాంపియన్స్‌ ట్రోఫీ అనే టాక్‌ వినిపిస్తు్న్న క్రమంలో ఈ ట్రోఫీని గెలిచి.. ఘనంగా వీడ్కోలు చెప్పాలని అనుకుంటే ఆఫ్ఘాన్‌ దెబ్బేసిందని కూడా క్రికెట్‌ అభిమానులు అంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.