Abhishek Sharma: ఏంటి బ్రో అంత మాట అన్నావ్! యువీ శిష్యుడిపై నితీశ్ రెడ్డి ఇన్‌స్టా పోస్ట్ వైరల్

ముంబై వాంఖడే స్టేడియంలో అభిషేక్ శర్మ తన అద్భుత ఇన్నింగ్స్‌తో 135 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాడు. నితీశ్ రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో అభిషేక్‌ను ప్రశంసించగా, అది వైరల్ అయింది. భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచి ఇంగ్లాండ్‌ను 97 పరుగులకే ఆలౌట్ చేశారు. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది.

Abhishek Sharma: ఏంటి బ్రో అంత మాట అన్నావ్! యువీ శిష్యుడిపై నితీశ్ రెడ్డి ఇన్‌స్టా పోస్ట్ వైరల్
Abhishek Sharma

Updated on: Feb 03, 2025 | 8:50 AM

టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన అద్భుత ఇన్నింగ్స్‌తో ముంబై వాంఖడే స్టేడియంలో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించాడు. ఇంగ్లాండ్ బౌలర్లను చిత్తు చేస్తూ కేవలం 54 బంతుల్లోనే 135 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 బౌండరీలు, 13 సిక్సర్లు ఉండగా, వాంఖడే స్టేడియం మొత్తం అతడి బ్యాటింగ్ ధాటికి ఊగిపోయింది.

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఫీల్డింగ్ ఎంచుకోవడం అతనికి పెద్ద తప్పిదంగా మారింది. ప్రారంభం నుంచే అభిషేక్ శర్మ బౌండరీల వర్షం కురిపిస్తూ బంతిని బౌండరీ లైన్ దాటించడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేశాడు. 17 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న అతను కేవలం 37 బంతుల్లోనే శతకాన్ని నమోదు చేశాడు. శతకానంతరం కాస్త నెమ్మదించినా ఆఖరి ఓవర్లలో మళ్లీ తన స్ట్రోక్‌ ప్లే‌తో మెరుపులు మెరిపించాడు.

ఈ ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ అనేక రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 అంతర్జాతీయాల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా, టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు.

అభిషేక్ శర్మ గెలుపుపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. తెలుగు యువ క్రికెటర్ నితీశ్ రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిషేక్ శర్మను ప్రశంసిస్తూ “మెంటల్ నా కొడుకు” అంటూ పోస్టు చేయగా, అది వైరల్ అయ్యింది.

మ్యాచ్ విషయానికొస్తే, అభిషేక్ శర్మ (135; 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సర్లు) శతకంతో పాటు శివమ్ దూబే (30; 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (24; 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) రాణించడంతో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడన్ కార్సే 3 వికెట్లు, మార్క్ వుడ్ 2 వికెట్లు, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జేమీ ఓవర్టన్ తలా 1 వికెట్ తీశారు.

247 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే, అభిషేక్ శర్మ తలా 2 వికెట్లు తీశారు. రవి బిష్ణోయ్ ఒక వికెట్ పడగొట్టాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ (55; 23 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మాత్రమే మెరుగైన ఆటతీరు ప్రదర్శించగా, జాకబ్ బెథెల్ (10) ఒక్కరే రెండంకెల స్కోరు అందుకున్నారు.

ఈ ఘన విజయం ద్వారా భారత జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. అభిషేక్ శర్మ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో అంతర్జాతీయ క్రికెట్‌లో తన స్థానాన్ని మరింత బలపరుచుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..