Vijay Hazare Trophy : 9 మ్యాచ్‌లు..5 సెంచరీలు..ఎవడు మమ్మీ వీడు..మనీషా లేక రన్ మెషినా ?

Vijay Hazare Trophy : విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో విదర్భ జట్టు సంచలనం సృష్టించింది. డిఫెండింగ్ ఛాంపియన్ కర్ణాటక కు చుక్కలు చూపిస్తూ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఈ విజయం తో విదర్భ టైటిల్‌కు కేవలం ఒక్క అడుగు దూరంలో నిలిచింది.

Vijay Hazare Trophy : 9 మ్యాచ్‌లు..5 సెంచరీలు..ఎవడు మమ్మీ వీడు..మనీషా లేక రన్ మెషినా ?
Aman Mokhade

Updated on: Jan 16, 2026 | 7:51 AM

Vijay Hazare Trophy : బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్‌లో జరిగిన మొదటి సెమీఫైనల్ పోరులో విదర్భ అద్భుత విజయాన్ని అందుకుంది. పటిష్టమైన కర్ణాటక జట్టును మట్టికరిపించి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. విదర్భ విజయంలో ఓపెనర్ అమన్ మొఖాడే మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో తన భీభత్సమైన ఫామ్‌ను కొనసాగిస్తూ ఏకంగా ఐదో సెంచరీ బాది, కర్ణాటక ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కర్ణాటక మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, దేవదత్ పడిక్కల్ తక్కువ పరుగులకే అవుట్ కావడంతో కర్ణాటక కష్టాల్లో పడింది. ఆ సమయంలో కరుణ్ నాయర్ (76) తన అనుభవంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. కృష్ణన్ శ్రీజిత్ (54) తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ విదర్భ బౌలర్ దర్శన్ నల్కండే నిప్పులు చెరిగే బౌలింగ్‌తో 5 వికెట్లు పడగొట్టడంతో కర్ణాటక 49.4 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌట్ అయింది.

281 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భకు అమన్ మొఖాడే అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఏమాత్రం తడబడకుండా కర్ణాటక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 122 బంతుల్లోనే 138 పరుగులు చేసి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. అతనికి తోడుగా రవికుమార్ సమర్థ్ (76 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో విదర్భ 46.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. అమన్ మొఖాడే ఈ టోర్నీలో ఆడిన 9 మ్యాచ్‌ల్లోనే 5 సెంచరీలు బాదడం ఒక అరుదైన రికార్డు.

ఈ విజయంతో విదర్భ జట్టు టైటిల్ పోరుకు సిద్ధమైంది. జనవరి 16న సౌరాష్ట్ర, పంజాబ్ జట్ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్‌లో గెలిచిన జట్టుతో విదర్భ ఫైనల్‌లో తలపడుతుంది. ప్రస్తుత ఫామ్ చూస్తుంటే అమన్ మొఖాడే విదర్భకు మొదటి విజయ్ హజారే ట్రోఫీని అందిస్తాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ కర్ణాటక ఇంటిదారి పట్టడం ఈ టోర్నీలో ఒక పెద్ద కుదుపుగా పరిగణించవచ్చు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..