
Women’s World Cup 2025 : మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 భారత్, శ్రీలంకలో సెప్టెంబర్ 30 నుండి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు బుధవారం తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో 17 ఏళ్ల వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ కరాబో మేసోకు చోటు లభించింది. ప్రపంచ కప్ వంటి పెద్ద ఈవెంట్‌లో 17 ఏళ్ల కరాబో మేసోకు అవకాశం ఇవ్వడం, ఆమెపై సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు ఉన్న నమ్మకాన్ని చూపిస్తుంది. మేసో ఈ సంవత్సరం మార్చిలో శ్రీలంకపై టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌తో సీనియర్ జట్టులో అడుగుపెట్టింది. ఆమె సౌతాఫ్రికా తరపున ఇప్పటివరకు రెండు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడింది. గతంలో 2023, 2025లో రెండు అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లలో కూడా పాల్గొంది.
మాజీ కెప్టెన్‌కు నిరాశ
లారా వోల్వార్డ్ట్ కెప్టెన్సీలో ప్రపంచ కప్ కోసం సౌతాఫ్రికా 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఇటీవల రిటైర్మెంట్ నుంచి తిరిగి వచ్చిన మాజీ కెప్టెన్ డాన్ వాన్ నీకెర్క్కు చోటు దక్కలేదు. గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న నీకెర్క్, ప్రపంచ కప్‌లో ఆడాలనే ఆశతోనే మళ్లీ తిరిగి వచ్చింది. కానీ, ఆమెకు నిరాశ ఎదురైంది. జట్టులో సునే లుస్, మరిజాన్ క్యాప్, నాన్‌కులులేకో మ్లాబా, క్లో ట్రయాన్, తాజ్మిన్ బ్రిట్స్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు.
జట్టు బలం, బాధ్యతలు
కెప్టెన్ లారా వోల్వార్డ్ట్, తాజ్మిన్ బ్రిట్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. దక్షిణాఫ్రికాకు మిడిల్, లోయర్ ఆర్డర్‌లో మరిజాన్ క్యాప్, సునే లుస్, నాండూమిసో షంగాసే, నదీన్ డి క్లార్క్, క్లో ట్రయాన్, అన్నేరీ డెర్క్‌సెన్, అన్నేకే బాష్ వంటి ఆల్‌రౌండర్లు ఉన్నారు. సీనియర్లు అయిన సైనలో జఫ్తా, యువ కరాబో మేసోతో కలిసి వికెట్ కీపింగ్ బాధ్యతలను పంచుకుంటారు. బౌలింగ్‌లో, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ మ్లాబా స్పిన్ దాడికి నాయకత్వం వహిస్తారు. మసాబాటా క్లాస్, తుమి సెక్హుఖునే ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని పంచుకుంటారు. క్యాప్, ట్రయాన్, డి క్లార్క్ బౌలింగ్‌ను మరింత బలోపేతం చేస్తారు.
ప్రపంచ కప్ సెప్టెంబర్ 30న ప్రారంభమై, నవంబర్ 2న ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. సౌతాఫ్రికా క్రికెట్ జట్టు తమ మొదటి మ్యాచ్‌ను గువాహటిలో ఇంగ్లాండ్‌తో ఆడుతుంది.
సౌతాఫ్రికా జట్టు (15 మంది సభ్యులు)
లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), అయబొంగా ఖాకా, క్లో ట్రయాన్, నదీన్ డి క్లార్క్, మరిజాన్ క్యాప్, తాజ్మిన్ బ్రిట్స్, సైనలో జఫ్తా, నాన్‌కులులేకో మ్లాబా, అన్నేరీ డెర్క్‌సెన్, అన్నేకే బాష్, మసాబాటా క్లాస్, సునే లుస్, కరాబో మేసో, తుమి సెక్హుఖునే, నాండూమిసో షంగాసే.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..