Vaibhav Sooryavanshi: 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 4ఫోర్లు, 5 సిక్స్‌లతో వైభవ్ ఊచకోత..

Vaibhav Sooryavanshi Half Century: వైభవ్ సూర్యవంశీ పవర్‌ప్లే చివరి ఓవర్‌లో తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అతను నూర్ అహ్మద్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది, కేవలం 15 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని పూర్తిచేశాడు. పవర్‌ప్లేలో వైభవ్ ఐదు సిక్సర్లు కొట్టాడు. జట్టు ఆరు ఓవర్లలో 74 పరుగులు చేసింది.

Vaibhav Sooryavanshi: 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 4ఫోర్లు, 5 సిక్స్‌లతో వైభవ్ ఊచకోత..
Vaibhav Suryavanshi

Updated on: Mar 30, 2026 | 10:14 PM

Vaibhav Sooryavanshi Half Century: గువహటిలోని బర్సాపరా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పరుగుల వర్షం కురిపించాడు. 128 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు సూర్యవంశీ కళ్ళు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. అన్షుల్ కాంబోజ్ వేసిన ఐదో ఓవర్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో విరుచుకుపడి జట్టు స్కోరును 5 ఓవర్లలోనే 55 పరుగులకు చేర్చాడు. ఆ తర్వాత నూర్ అహ్మద్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది కేవలం 15 బంతుల్లోనే 50 పరుగులు మార్కును అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన ఫిఫ్టీలలో ఒకటిగా ఇది నిలిచిపోయింది.

తడబడిన చెన్నై బ్యాటర్లు..

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ బౌలర్ల ధాటికి తలవంచింది. నండ్రే బర్గర్ (2/26), జోఫ్రా ఆర్చర్ (2/19) నిప్పులు చెరిగే బంతులతో సిఎస్‌కే టాపార్డర్‌ను కుప్పకూల్చారు. కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ మార్పులు అద్భుతంగా పనిచేశాయి. జేమీ ఓవర్టన్ (43 పరుగులు) ఒంటరి పోరాటం చేయడంతో చెన్నై 19.4 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్ కూడా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చెన్నైని కోలుకోనివ్వలేదు.

విజయం దిశగా రాయల్స్..

ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ పూర్తి పట్టు సాధించింది. సూర్యవంశీ 17 బంతుల్లో 52 పరుగులు (4 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి అవుట్ అయినప్పటికీ, యశస్వి జైస్వాల్ క్లాస్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలుపు తీరాలకు చేరుస్తున్నాడు. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్‌తో పాటు ధ్రువ్ జురెల్ ఉన్నారు. రాజస్థాన్ విజయం సాధించాలంటే ఇంకా కేవలం 51 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది, చేతిలో 9 వికెట్లు ఉండటంతో రాయల్స్ గెలుపు లాంఛనంగానే కనిపిస్తోంది.

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (బంతుల వారీగా)..

13 – యశస్వి జైస్వాల్ vs KKR, కోల్‌కతా, 2023

15 – వైభవ్ సూర్యవంశీ vs CSK, గౌహతి, 2026*

17 – వైభవ్ సూర్యవంశీ vs GT, జైపూర్, 2025

18 – జోస్ బట్లర్ vs DD, ఢిల్లీ, 2018

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us